- ఐక్యరాజ్యసమితిని ప్రశ్నించిన భారత్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో మానవ హక్కుల పరిస్థితిపై నివేదిక ఎప్పుడు విడుదల చేస్తారని భారత్ ఐక్యరాజ్యసమితిని ప్రశ్నించింది. అక్కడ జరిగిన హింసాత్మక ఘటనలు, మరణాలు, ఇంటర్నెట్ ఆంక్షలపై పాకిస్థాన్ తీసుకున్న చర్యలను వెల్లడించాలని కోరింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని భారత్ డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి అనుజ్ స్వరూప్ బుధవారం ఐరాస జనరల్ అసెంబ్లీ మూడో కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. పీవోకేలో జరిగిన మరణాలపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరపాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం గతంలో పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నిరసనల్లో పాల్గొన్నందుకు అరెస్టయిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకులకు న్యాయ సహాయం, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పించాలని కూడా ఐరాస సూచించింది. నిర్బంధంలో ఉన్నవారికి న్యాయపరమైన ప్రక్రియ, న్యాయమైన విచారణ అందాలని కోరింది. అలాగే పీవోకేలో ఇంటర్నెట్ ఆంక్షలను ఎత్తివేసి, స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అర్థవంతమైన రాజకీయ చర్చలు జరపాలని సూచించింది.
ఈ అంశాలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ఐరాస మానవ హక్కుల విభాగం నివేదిక ఇవ్వాలని అనుజ్ స్వరూప్ ప్రశ్నించారు. కొన్ని దేశాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై స్పందిస్తూ, మరికొన్ని ప్రాంతాల్లోని ఘటనలను పట్టించుకోకపోవడం వల్ల అంతర్జాతీయ సంస్థలపై విశ్వాసం తగ్గుతుందని భారత్ అభిప్రాయపడింది.








కామెంట్లు (0)