సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ పోలీసుల దాష్టీకంపై అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీల ఖండన

4 గంటల క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎంకు సంఘీభావం

న్యూఢిల్లీ : సిపిఎం సీనియర్‌ ‌ నాయకులు, కార్యకర్తలపై ఢిల్లీ పోలీసుల దాడులు, నిర్భంధాలను వివిధ దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. సిపిఎంకు సంఘీభావం తెలిపాయి. ఢిల్లీ పోలీసుల అణచివేతను బ్రెజిల్ కమ్యూనిస్ట్ పార్టీ (పిసిడిఓబి), గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ (కెకెఇ), టర్కీ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ (టికెపి) వేర్వేరు ప్రకటనలలో ఖండించాయి. సిపిఎం నాయకత్వానికి సందేశాలు పంపాయి. టికెపి తన ప్రకటనలో కార్మిక వర్గ ఉద్యమంపై పెరుగుతున్న అణచివేతకు ఈ ఘటన మరో ఉదాహరణ అని పేర్కొంది. కమ్యూనిస్టు శక్తులను అణచివేసి, తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మలచడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించింది. సిపిఎంకు తమ సంఘీభావాన్ని పునరుద్ఘాటిస్తూ, శ్రామిక ప్రజల పోరాటాలు, ఆకాంక్షల నుండి పుట్టిన ఒక పార్టీని బెదిరింపులు, ప్రభుత్వ అణచివేత అణచివేయలేవని టికెపి పేర్కొంది.

​ పిసిడిఒబి తన ప్రకటనలో శాంతియుత నిరసనలపై పోలీసుల చర్యను ఖండించింది. సిపిఎం నాయకులు, ఎంపిలు, కార్యకర్తలను నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనకారులపై దాడి చేసి, వారిని బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారని, అదుపులోకి తీసుకున్న పార్టీ నాయకులకు ఆహారం, నీరు లేదా నిత్యావసర మందులు అందకుండా గంటల తరబడి పోలీసు వాహనాల్లోనే ఉంచారని విమర్శించింది. అరెస్టయిన మహిళలకు కనీసం మరుగుదొడ్ల సౌకర్యాన్ని కూడా నిరాకరించారని తెలిపింది. పోలీసుల అణిచివేత చర్యపై తక్షణ విచారణ జరపాలని పిలుపునిచ్చింది.

ఈ ఘటనకు బాధ్యలైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేసింది. అదుపులో ఉన్న వారిని విడుదల చేయాలని, నిరసన తెలిపే హక్కును వినియోగించుకున్న వారిపై అభియోగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేసింది. సిపిఎం నాయుకులతో పాటు విద్యార్థులు, కార్మికులు, పాత్రికేయులు, క్షేత్రస్థాయి సంస్థలపై జరుగుతున్న వేధింపులను అంతం చేయాలని కూడా డిమాండ్‌ ‌చేసింది.

​ అదేవిధంగా, కెకెఇ తన ప్రకటనలో సిపిఎం, దాని యువజన విభాగమైన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) నాయకులు, సభ్యులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వేధింపులు, హింస, అరెస్టులను ఖండించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శనలు జరిగాయని కెకెఇ పేర్కొంది. అలాగే, ఎంఎ బేబీ, పినరయి విజయన్, పొలిట్ బ్యూరో సభ్యులు, రాజ్యసభ ఎంపీలు జె. బ్రిటాస్, వి. శివదాసన్‌లతో పాటు మరి కొందరు నేతల నిర్బంధించడాన్ని కెకెఇ ప్రముఖంగా ప్రస్తావించింది. అరెస్టు అయిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ తమ హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం, డివైఎఫ్ఐ, ఇతరులకు సంఘీభావం తెలిపింది.

మొత్తంగా ఈ మూడు పార్టీలు కూడా పోలీసు చర్యలు, రాజకీయ స్వేచ్ఛ, అసమ్మతి తెలిపే హక్కుపై తమ ఆందోళనలను ప్రముఖంగా ప్రస్తావించాయి. సిపిఎంకు, నిరసనకారుల ప్రజాస్వామ్య హక్కులకు తమ సంఘీభావాన్ని పునరుద్ఘాటించాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్