శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ ఆక్రమణతో తీవ్ర సంక్షోభం

3 రోజుల క్రితం

uno
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 09:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఐరాస ఆందోళన

న్యూయార్క్: పాలస్తీనా భూభాగమైన వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ చేపడుతున్న చర్యలు తీవ్ర మానవతా సంక్షోభానికి దారితీస్తున్నాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) పేర్కొంది. పాలస్తీనా ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలు, అక్రమ యూదు స్థావరాల నిర్మాణం, స్థిరనివాసుల హింస కారణంగా 1967 యుద్ధం తర్వాత వెస్ట్ బ్యాంక్ అత్యంత తీవ్రమైన స్థానభ్రంశ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఐరాస నివేదిక వెల్లడించింది. ఐరాస భద్రతా మండలికి సమర్పించిన నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్ చేపడుతున్న అక్రమ నిర్మాణాలు, యూదు స్థిరనివాసుల దాడులు పాలస్తీనియన్లను వారి సొంత భూముల్లోనే నిరాశ్రయులుగా మారుస్తున్నాయి. ఇళ్లను కూల్చివేయడం, వ్యవసాయ భూములను ధ్వంసం చేయడం, ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోందని నివేదిక పేర్కొంది.

ఈ నివేదికపై ఐరాస భద్రతా మండలిలో జరిగిన చర్చ సందర్భంగా పలు సభ్య దేశాలు ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా ఖండించాయి. ఆక్రమిత భూభాగాల్లో నిర్మాణ కార్యకలాపాల్లో పాల్గొంటున్న కంపెనీలు చట్టపరమైన, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం ఉందని ఫ్రాన్స్ హెచ్చరించింది. అయితే, వెస్ట్ బ్యాంక్‌లో పరిస్థితులపై జరిగిన సమావేశంలో అమెరికా ఎప్పటిలాగే ఇజ్రాయిల్‌ దురాగతాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. హమాస్‌ను నిరాయుధీకరణ చేయకుండా శాంతి సాధ్యం కాదని వాదిస్తూ, ఇజ్రాయిల్ భద్రతా చర్యలకు మద్దతు తెలిపింది. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయిల్ వేలాది యూదు స్థావరాలను నిర్మిస్తోందని, సైన్యం రక్షణలో స్థిరనివాసులు పాలస్తీనా ఇళ్లు, పొలాలను ధ్వంసం చేస్తూ స్థానికులను బలవంతంగా తరలిస్తున్నారని ఐరాస నివేదిక పేర్కొంది. దీంతో వేలాది మంది పాలస్తీనియన్లు తమ సొంత భూముల్లోనే నిరాశ్రయులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్