శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భగ్గుమన్న ఫ్రాన్స్

1 గంట క్రితం

భగ్గుమన్న ఫ్రాన్స్ 
- మరోసారి నిప్పులగుండమైన పారిస్‌
- దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనల హోరు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​- మరోసారి నిప్పులగుండమైన పారిస్‌

- దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనల హోరు

పారిస్: స్కూల్ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా కార్మికులు, ప్రజలు ఉద్యమించడంతో ఫ్రాన్స్ భగ్గుమంది. పెరిగిన జీవన వ్యయం, విద్యా వ్యవస్థ దుస్థితి, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. విద్యార్థులు, కార్మిక సంఘాలు, ‘ఎల్లో వెస్ట్’ ఉద్యమకారులు వీటిలో పాల్గొన్నారు. అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలను పోలీసులు అడ్డుకుని బాష్పవాయువు గోళాలు, వాటర్‌ ‌కెనన్లు ప్రయోగించడంతో హింస చెలరేగింది. పారిస్‌లో ఎటుచూసిన నిప్పంటించిన వాహనాలు, తగలబడుతున్న భవనాలతో నిప్పులగుండంగా మారిపోయింది. అలాగే, ఫ్రాన్స్‌లో మూడో అతిపెద్ద నగరమైన లియోన్‌లో పర్యాటక కార్యాలయం లోపల మంటలు చెలరేగాయి. భవనం నుంచి పొగ, మంటలు ఎగసిపడటం కనిపించింది. దక్షిణ ఓడరేవు నగరం మార్సెయిల్‌లో కొన్ని దుకాణాలు, ఒక మున్సిపల్ పోలీస్ స్టేషన్ దెబ్బతిన్నాయి. పారిస్ నగర కేంద్రానికి ఈశాన్యంగా ఉన్న ప్లాస్ డె లా రెపబ్లిక్ కూడలిలో భారీ ర్యాలీ జరిగింది.

​ దేశవ్యాప్తంగా 600కు పైగా ప్రదర్శనలు జరిగాయని ఆ దేశ మీడియా నివేధించింది. వీటిల్లో సుమారు రెండు లక్షల మంది పాల్గొన్నారని అధికారులు తెలిపారు.

రాజధాని పారిస్‌లోనే 40 వేల మంది నిరసనలో పాల్గోన్నారు. అలాగే, పారిస్‌లో ఆంక్షలు విధించారు. ఎలీజే అధ్యక్ష భవనం, ప్రధాని కార్యాలయం, షాంజెలిజే మార్గం సహా కీలక ప్రాంతాల్లో ర్యాలీలను నిషేధించారు. అనేక మెట్రో స్టేషన్లను మూసివేశారు. అయితే, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శాంతి పాటించాలంటూ పిలుపునిచ్చారు. కానీ, సమస్యల పరిష్కారానికి విద్యార్థులతో చర్చలకు సిద్ధపడకపోవడం గమనార్హం.

స్కూల్‌ ‌పిల్లల నిరసనలతో మొదలై..

​ గత నెలలో పాఠశాలల పరిస్థితిపై మొదలైన ఆందోళనలు దేశమంతటా విస్తరించాయి. ఉపాధ్యాయుల గైర్హాజరు, పాడుబడిన భవనాలపై విద్యార్థులు గళమెత్తారు. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం విద్యార్థులపై విరుచుకుపడింది. వీరిపై స్టన్ గ్రనేడ్‌‌లు ప్రయోగించడంతో పలువురు విద్యార్థులు చేతులు, వేళ్లు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు తమ ఉద్యమాన్ని మరింత విస్తరించారు. విద్యార్ధులకు తోడుగా కార్మికులు కూడా తోడు కావడంతో మాక్రాన్‌ ‌ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.

‘ఎల్లో వెస్ట్’ పునరుద్ధరణకు పిలుపు

​ 2018లో సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా మొదలైన ‘ఎల్లో వెస్ట్’ (పసుపు చొక్కాల) ఉద్యమాన్ని పునరుద్ధరించాలన్న సోషల్ మీడియా పిలుపులకు స్పందించి దేశవ్యాప్తంగా జనం రోడ్డెక్కారు. గత నెల నుంచి పాఠశాలల దిగ్బంధనం ద్వారా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలు తమకు మద్దతు తెలపాలని కోరాయి. అలాగే, ప్రముఖ కార్మిక సంఘం సిజిటి కూడా ఈ నిరసనలకు మద్దతు ఇచ్చింది. ‘‘అధిక వేతనాలు, పెన్షన్లు, తక్కువ ధరలు, ప్రజల అవసరాలను తీర్చే ప్రజా సేవల పరిరక్షణ’’ కావాలని కార్మిక సంఘం డిమాండ్ చేసింది.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్