mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్విట్జర్లాండ్‌లో శాంతి చర్చలు

13 గంటల క్రితం

peace deal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 10:35 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- చేరుకున్న అమెరికా, ఇరాన్, పాక్, ఖతార్ నేతలు

- ఒప్పందం కుదరకపోతే హర్మూజ్‌‌లో సుంకాలు వసూలు : ట్రంప్‌

- లెబనాన్‌‌పై దాడులు ఆపకుంటే తుది ఒప్పంద చర్చలు అసాధ్యం : ఇరాన్

​ జెనీవా : పశ్చిమాసియాలో యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలికేందుకు ఉద్దేశించిన తుది ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇరాన్, అమెరికా ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో చర్చలు ప్రారంభించారు. లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా హర్మూజ్‌‌ను మూసివేసినట్లు ఇరాన్‌ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైనిక అధిపతి అసిమ్ మునీర్‌తో కలిసి ఆదివారం స్విట్జర్లాండ్‌కు చేరుకున్నారు. బర్జెన్‌స్టాక్ పట్టణంలోని విలాసవంతమైన హోటల్ కాంప్లెక్స్‌లో ఈ చర్చలు జరుగుతున్నాయి. లెబనాన్‌లో దాడులు ఆగకపోతే చర్చల ద్వారా పెద్దగా సాధించలేమని ఇరాన్ స్పష్టం చేసింది.

హర్మూజ్‌‌లో సుంకాలు విధిస్తా : ట్రంప్‌

ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన హర్మూజ్‌‌లో అమెరికా స్వయంగా సుంకాలను విధిస్తుందని ఆయన తాజాగా హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు అమెరికా అందించిన రక్షణ సేవలకుగానూ ఆ డబ్బును తీసుకుంటామన్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం 60రోజుల పాటు ఎటువంటి సుంకాలు లేకుండా నౌకల రవాణా ఉండాలంటూ ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయి మాట్లాడుతూ, గతంలో ఒప్పందాలను గౌరవించడంలో ఇతర పక్షాలు విఫలమైనందున, స్విట్జర్లాండ్‌లో తమ షరతులను నెరవేర్చాలని ఇరాన్ ఒత్తిడి చేస్తుందని స్పష్టం చేశారు.

​లెబనాన్‌‌పై దాడులే కీలకాంశం: ఇరాన్

ఇజ్రాయిల్‌, హిజ్బుల్లా మధ్య లెబనాన్‌లో జరుగుతున్న సంఘర్షణ, స్తంభింపచేసిన ఇరాన్ నిధులు, దేశ చమురు అమ్మకాలు వంటి అంశాలు అమెరికాతో స్విట్జర్లాండ్‌లో జరిగే చర్చల్లో ప్రధాన ఎజెండాగా ఉంటాయని ఇరాన్‌ ఆదివారం తెలిపింది. ‘‘జియోనిస్ట్ పాలన లెబనాన్‌లో కట్టుబాట్లను ఉల్లంఘిస్తూనే ఉంది, ఈ సమస్య నేటి చర్చల్లో ప్రధాన అంశం అవుతుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయి మీడియాకు తెలిపారు. ‘‘ఇరాన్ స్తంభింపజేసిన లేదా పరిమితం చేసిన ఆస్తులను అందుబాటులోకి తీసుకురావడం, ఇరాన్ చమురు అమ్మకాలకు అవసరమైన లైసెన్స్‌లను జారీ చేయడానికి సంబంధించిన చర్చలు కూడా ఎజెండాలో ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

చారిత్రకమైన సమావేశం : జెడి వాన్స్‌

అమెరికా - ఇరాన్ చర్చలు స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన సందర్భంగా, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ సమావేశాన్ని ‘‘చారిత్రకమైనది’’గా అభివర్ణించారు. ‘‘ఇది ఒక చారిత్రక సమావేశం. ఇరాన్ ప్రజలతో మన సంబంధాలను మార్చడం, కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని వాన్స్ బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో అన్నారు. కాల్పుల విరమణ కొనసాగుతుందని విశ్వసిస్తున్నానని, ఇదొక చారిత్రాత్మక సమావేశమని చెప్పారు.

​ అణుబాంబు తయారుచేయం: పెజెష్కియాన్

అమెరికాతో కుదుర్చుకున్న ఎంఒయులో ఉన్న మరికొన్ని అంశాలను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులలో ఆరు బిలియన్ డాలర్లు ఖతార్ వద్ద ఉన్నాయి. ఎంఒయూ ప్రకారం ఇప్పుడు అవి ఇరాన్‌కు తిరిగి వస్తాయి. ‘ఎంఒయులోని నిబంధనలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. చర్చలు, సంప్రదింపులలో మేము సాధించినవి త్వరలోనే తెలుస్తాయి’ అని పెజెష్కియాన్‌ మీడియాకు తెలిపారు. గతంలో అమెరికా వేటినైతే నిషేధించిందో ఇప్పుడు వాటినే ఇరాన్ ప్రజల హక్కులుగా ప్రకటించిందని ఆయన చెప్పారు. స్విట్జర్లాండ్ చర్చలపై అసంతప్తి వ్యక్తం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూయేనని వ్యాఖ్యానించారు. ‘మా వద్ద అణుబాంబు ఉండకూడదన్నది అమెరికా ప్రధాన ఉద్దేశం. మాకు అణుబాంబు వద్దని అమరుడైన మా సుప్రీం నేత పదే పదే చెప్పారు. అదే విషయాన్ని లిఖితపూర్వకంగా చెప్పాలని అమెరికా అడిగింది. మేము అలాగే రాసి ఇచ్చాం’ అని అన్నారు.

మినాబ్ పాఠశాల పిల్లలను స్మరించిన స్పీకర్‌

అమెరికాతో చర్చల కోసం స్విట్జర్లాండ్‌కు చేరుకున్న తర్వాత, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ మినాబ్‌ ‌పాఠశాలపై దాడిని గుర్తుచేశారు. ‘‘మినాబ్‌లోని అమాయక పిల్లలను, ప్రియమైన ఇరాన్‌లోని అమరవీరులందరినీ నేను ప్రతి క్షణం నా ప్రతి చర్య, ప్రవర్తనను పర్యవేక్షిస్తున్నట్లు భావిస్తున్నాను. వారు మమ్మల్ని చూస్తున్నారు, మా నుండి మంచి విషయాలను ఆశిస్తున్నారు" అని ఆయన సోషల్‌ ‌మీడియా ఎక్స్‌‌లో పోస్టు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్