- మెలోనీ విధానాలపై ఇటలీలో దేశవ్యాప్త సమ్మె
- కార్మికులకు తోడైన విద్యార్థులు
- కనీస వేతనాలు, సంక్షేమానికి నిధులు పెంచాలని డిమాండ్
రోమ్: ప్రధాని జార్జియా మెలోనీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఇటలీ అతిపెద్ద కార్మిక సంఘం సిజిఐఎల్ శుక్రవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించింది. వేలాది
మంది విద్యార్థులు,కార్మికులు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి కనీస వేతనాలు, సంక్షేమానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. మా భవిష్యత్తును తిరిగి నిర్మించుకుంటామని, ప్రజలపై భారాలు తగ్గించాలని వారు నినదించారు. ఈ సమ్మెతో ఇటలీలో జనజీవనం స్తంభించింది. పాఠశాలలు, ప్రైవేట్, ప్రభుత్వ హాస్పటల్స్, వివిధ ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ సమ్మెకు విమాన, రైలు సేవలకు మినహాయింపు ఇచ్చారు. అయితే, శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా రైలు సమ్మె చేపడుతున్నామని సిజిఐఎల్తో పాటూ గ్రాస్రూట్స్ సంఘం కోబాస్ సహా ఇతర కార్మిక సంఘాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. రోమ్ నగరం నినాదాలతో హోరెత్తింది. ఐరోపా వ్యాప్తంగా పెరుగుతున్న జీవన వ్యయాలు, సైనిక వ్యయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎగసిపడుతున్న తరుణంలో ఇటలీలో కార్మికులు, విద్యార్థులు సంయుక్తంగా ఆందోళనలు నిర్వహించడం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికలపై ఈ నిరసనల ప్రభావం ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘం సిజిఐఎల్ నాయకుడు మౌరిజియో లాండిని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువత వీధుల్లోకి వచ్చి పాలకుల విధానాలను ప్రశ్నించారని, వారు కార్మికులతో కలిసి గొంతుకలిపారని తెలిపారు. కార్మిక, విద్యార్థి ఐక్యతతో సంయుక్తంగా సమ్మె విజయవంతమైందని తెలిపారు. యూరప్ అంతటా మార్పుకోసం ఉద్యమాలు పెరుగుతున్నాయన్నారు.
మా భవిష్యత్తును మేమే నిర్మించుకుంటాం..
గతనెల 30న విద్యకు నిధులు పెంచాలని, జీవన, గృహ వ్యయాల భారం తగ్గించాలని కోరుతూ వేలాది మంది విద్యార్థులు, కార్మికులు కలిసి ఉద్యమించారు. అప్పటి నుంచి విద్యార్థి సంఘాలు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిరసనలు కొనసాగిస్తున్నాయి. సైనిక వ్యయం పెంచడాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. అలాగే, ప్రభుత్వం ఆరోగ్య, విద్యా రంగాలను భారీగా కోత పెడుతోందని 24 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థిని లారా పెరిటోరే విమర్శించారు. వెనక్కి తగ్గబోమని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారని, ‘‘మా భవిష్యత్తును మరలా నిర్మించుకుంటాం’’ అని ఆమె మీడియాతో అన్నారు.
ఇల్లు గడవడమే కష్టంగా ఉంది..
ఇటలీలో కార్మికులకు ఇల్లు గడవడమే కష్టంగా ఉందని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనాలు, మెరుగైన ఆరోగ్య వ్యవస్థ, నాణ్యమైన విద్యను అందించాలని వారు కోరుతున్నారు. అయితే, ప్రధాని మెలోనీ 26 బిలియన్ యూరోల (సుమారు 30 బిలియన్ డాలర్లు) 2027 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నారు. దీంతో శ్రామికులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని వారు విమర్శిస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మార్కెట్లు పుంజుకోవాలంటే జీతాలు పెంచాలని, తక్షణమే అగ్రిమెంటులు పునరుద్ధరించాలని, పింఛన్లకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, అలాగే, ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే. ప్రభుత్వ పరిశీలనలో ఈ డిమాండ్లు లేవని దానికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నేతలు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి అడాల్ఫో ఉర్సో ఈ సమ్మెను ‘‘ముందస్తు దాడి’’గా కొట్టిపారేశారు. బడ్జెట్లో ఏముందో తెలియకముందే కార్మిక నేతలు సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. నిరసన తెలుపుతున్నవారిపై, పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించినవారిపై తనకు గౌరవం ఉందంటూనే, పార్లమెంటులో బడ్జెట్ మరింత మెరుగుపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.








కామెంట్లు (0)