- నలుగురు భారతీయులు మృతి
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లోని దక్షిణ ఓడరేవు ఒడెసా నుంచి బయలుదేరిన ఒక వాణిజ్య నౌకపై ఆదివారం జరిగిన దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ కూడా ధ్రువీకరించింది. రష్యా మూడు క్రూయిజ్ క్షిపణులతో నౌకపై దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ నౌకాదళం ఒక సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. ఐదుగురు భారతీయులతో సహా మొత్తం 17 మంది సిబ్బందితో ఉన్న ఎంవి గోల్డెన్ లియో నౌకపై రష్యా దాడి చేసిందని తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ‘ఇలాంటి దాడులను భారత్ ఖండిస్తుంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం కలిగించడం, లేదా నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగించడాన్ని ఖండిస్తున్నాం, వీటిని తక్షణమే ఆపాలని పునరుద్ఘాటిస్తున్నాం’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ఎక్స్ పోస్టులో తెలిపింది. అలాగే, ఉక్రెయిన్‌లోని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, బాధితులకు సహాయం అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పింది. అదేవిధంగా మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం ప్రకటించింది.








కామెంట్‌లు (0)