- ఇరాన్‌పై ఆంక్షల కొనసాగింపునకు జిత్తులు
- తీర్మానాన్ని వీటోతో తిప్పికొట్టిన రష్యా, చైనా
జెనీవా : ఇరాన్‌పై ఇజ్రాయిల్‌తో కలిసి యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న అమెరికాకు రష్యా, చైనా గట్టి గుణపాఠం చెప్పాయి. ఇరాన్‌కు అండగా నిలిచాయి. ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా, చైనాలు వీటో చేశాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా వీటో అధికారాలు ఉన్న ఈ రెండు దేశాలు గురువారం జరిగిన ఓటింగ్‌లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. ఐరాసలో అమెరికా తీర్మానంపై ఓటింగ్ జరగ్గా, ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా, రష్యా, చైనా వీటో అధికారాన్ని వాడుకోగా, సోమాలియా, పాకిస్తాన్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఆరునెలలుగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తున్న అమెరికా.. టెహ్రాన్‌ను ఆర్థికంగానూ దెబ్బతీయాలనే దుర్భుద్ధితో ఐరాస వేదికగా ఎత్తులు వేయగా..రష్యా, చైనా తుత్తునీయులు చేశాయి.
ఇరాన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మధ్య 2015లో కుదిరిన అణు ఒప్పందం నిబంధనలను ఇరాన్ ఉల్లంఘిస్తోందని యూరప్ దేశాలు ఆరోపించాయి. ఈ క్రమంలో ఐరాస కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సెప్టెంబరులో స్నాప్‌బ్యాక్ మెకానిజం కింద ఇరాన్‌పై చర్యలు తీసుకుంది. ఇరాన్‌పై ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీకి అధికారం కల్పించింది. కాగా, ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఇరాన్ విదేశీ ఆస్తులను స్తంభింపజేయడం, టెహ్రాన్‌తో ఆయుధ ఒప్పందాలను నిలిపివేయడం, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమ అభివృద్ధిని నిరోధించడం వంటి ఇతర చర్యలు ఈ ఆంక్షల్లో ఉన్నాయి.
చైనా, రష్యాకు ఇరాన్ కృతజ్ఞతలు
తమ దేశానికి వ్యతిరేకంగా అమెరికా తీసుకొచ్చిన తీర్మానాన్ని వీటో చేసినందుకు చైనా, రష్యాలకు ఇరాన్ మిషన్ కృతజ్ఞతలు తెలిపింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఐరాస భద్రతా మండలిని దుర్వినియోగం చేయడానికి అమెరికా, దాని మిత్రదేశాలు చేస్తున్న మరో నీచ ప్రయత్నాన్ని ఈ దేశాలు అడ్డుకున్నాయని పేర్కొంది. ఐరాస భద్రతా మండలిలో అమెరికా తీర్మానికి వ్యతిరేకంగా చైనా, రష్యాలు వీటో చేయడంపై హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు, తమ తీర్మానికి వ్యతిరేకంగా రష్యా, చైనాలు వీటో చేయడంపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా డిప్యూటీ అంబాసిడర్ జెన్నిఫర్ లోసెట్టా అక్కసు వెళ్లగక్కారు. ఇరాన్‌పై విధించిన ఆంక్షలపై నిపుణుల పర్యవేక్షణను, అలాగే ప్యానెల్ సభ్యుల నియామకాన్ని అడ్డుకోవడానికి జరుగుతున్న విస్తృత ప్రయత్నంలో భాగమే ఈ వీటోలు అని ఆరోపించారు.
అయితే రాన్‌పై ఆంక్షలను తిరిగి విధించడం చట్టవిరుద్ధమని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా అభిప్రాయపడ్డారు. అందువల్ల ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ పదవీకాలాన్ని పొడిగించే తీర్మానం వీగిపోయిందన్నారు. ఈ తీర్మానం తీవ్రమైన లోపాలతో కూడుకున్నదని, దానికి ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదని ఆరోపించారు. ఈ తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టవద్దని రష్యా, చైనాలు అమెరికాను, దాని మిత్రదేశాలను గట్టిగా కోరాయని గుర్తు చేశారు.








కామెంట్‌లు (0)