- 12 మందికి తీవ్ర గాయాలు
చికాగో : అమెరికాలోని చికాగో నగరంలో శుక్రవారం రాత్రి ఒక వీధిలో గుమిగూడిన జనంపై ఎస్‌యూవీ వాహనం నుంచి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం 12 మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని సౌత్ సైడ్ ప్రాంతంలో ఒక వీధిలో గుమిగూడిన గుంపు వద్దకు ఎస్‌యువి వాహనం వచ్చి ఆగగా, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అనంతరం ఆ వాహనం అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు తీవ్ర గాయాలతో ప్రమాదకర స్థితిలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఒకరికి తొడ భాగంలో బుల్లెట్ గాయం తగిలింది. గాయపడిన వారిలో ఎనిమిది మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వీరి వయసు 17 నుంచి 47 సంవత్సరాల మధ్య ఉందని, వీరందరికీ నాలుగు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తికి కూడా గాయాలు తగిలినప్పటికీ, అతను వైద్య చికిత్స తీసుకునేందుకు నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఒక వ్యక్తికి కాల్పుల్లో గాయమైందన్న సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, వీపుపై రెండు బుల్లెట్ గాయాలతో ఒక మహిళ, వీపుపై నాలుగు రాపిడి గాయాలతో ఒక పురుషుడు కనిపించారు. వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం నుంచి చికాగో నగరంలో మొత్తం 21 మందికి పైగా కాల్పుల్లో గాయపడగా, నలుగురు మృతి చెందారని తెలుస్తోంది. అమెరికాలో బానిసత్వ నిర్మూలనను స్మరించుకుంటూ జరుపుకునే ‘‘జూన్‌టీన్త్’’ పండుగ రోజే ఈ కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇదే రోజు ఉదయం, మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా దంపతులు సౌత్ సైడ్‌లోని తమ ప్రెసిడెన్షియల్ సెంటర్‌ను సందర్శకుల కోసం తెరిచారు.









కామెంట్‌లు (0)