ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌ ప్రతిపాదనకు ట్రంప్ ‘నో’

1 రోజు క్రితం

ఇరాన్‌ ప్రతిపాదనకు ట్రంప్ ‘నో’ 
- హర్మూజ్‌‌ పేరు ట్రంప్‌ జలసంధిగా మార్పు
- సోషల్‌ మీడియాలో  పోస్టు చేసిన అమెరికా అధ్యక్షుడు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​- హర్మూజ్‌‌ పేరు ట్రంప్‌ జలసంధిగా మార్పు

- సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన అమెరికా అధ్యక్షుడు

టెహ్రాన్ : పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను చేసిన ప్రతిపాదనపై అమెరికా స్పందన కోసం ఇరాన్ వేచి చూస్తోంది. అయితే ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారంటూ అంతర్జాతీయ మీడియా నివేధించింది. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐరాస సర్వసభ్య సమావేశాలలో ఇరాన్ ఈ దౌత్య ప్రతిపాదననుముందుకు తెచ్చింది. దీనిని ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు చేరవేసింది. తన ప్రతిపాదనలకు అంగీకరిస్తే ఏడు రోజులలో హార్ముజ్ జలసంధిని తెరుస్తానని, యుద్ధానికి ముగింపు పలకవచ్చునని ఇరాన్ తెలియజేసింది. అయితే తన డిమాండ్లను ఇరాన్ నెరవేర్చకపోవచ్చునని ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించే అవకాశం ఉన్నదని ఆయన తన ఆంతరంగికులకు చెప్పారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాము ప్రతిపాదించిన ఒప్పందం హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఏడు రోజుల కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తుందని, అలాగే ప్రాంతీయ పోరుకు విరామం ఇస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శుక్రవారం ఐరాసలో విలేకరులకు చెప్పారు. హర్మూజ్‌ తెరిచే విషయంలో అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన అన్నారు. తమ ప్రతిపాదనకు అమెరికా అంగీకరిస్తే ఆ తర్వాత పరస్పరం అంగీకరించిన అంశాలపై విస్తృత స్థాయి చర్చలు ప్రారంభించవచ్చునని తెలిపారు. తమ ప్రతిపాదన ప్రకారం ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని, చమురు ఆంక్షలు రద్దు చేయాలని వివరించారు. కాగా హర్మూజ్‌లో సురక్షిత నౌకా మార్గాలకు సంబంధించి ఒమన్‌తో కుదిరిన అవగాహన గురించి అరాగ్చీ తన సౌదీ సహచరుడు ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌కు తెలియజేశారు.

హర్మూజ్‌‌ను ‘ట్రంప్ స్ట్రెయిట్‌’గా చిత్రీకరిస్తూ మ్యాప్ పోస్ట్ చేసిన ట్రంప్

హర్మూజ్‌ ‌ జలసంధిని ఒక వారంలోగా తెరవడానికి తాము సిద్ధమని, అయితే అమెరికా కొన్ని షరతులకు అంగీకరించాలని ఇరాన్ ఒక కొత్త ఒప్పందాన్ని ప్రతిపాదించిన కొద్దిసేపటికే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ జలసంధిని ‘ట్రంప్ స్ట్రెయిట్’ అని పేర్కొంటూ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. శనివారం తెల్లవారుజామున తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ ఈ చిత్రాన్ని పోస్ట్ చేశారు. మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ ఒప్పందం తనకు లబ్ధి చేకూర్చవచ్చని ఇరాన్ సూచించిన నేపథ్యంలో, ఈ అంశంపై ట్రంప్ ఆలోచనా ధోరణిని బహిర్గతం చేసే మొదటి బహిరంగ సంకేతంగా ఈ పోస్ట్ నిలిచింది. ఇదిలా ఉండగా, న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ నేతల సదస్సు ముగియడంతో ఇరాన్ అధ్యక్షుడు అక్కడి నుంచి బయలుదేరారని ఇరాన్ మీడియా సంస్థలు తెలిపాయి. ఈ సదస్సులో భాగంగా అమెరికాతో ఇరాన్ పరోక్ష చర్చలు కూడా జరిగాయి. మరోవైపు, పొరుగున ఉన్న యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారుల నుంచి ప్రయోగించిన మరో క్షిపణిని తాము అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్