సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇరాన్‌ నగరాలపై బాంబుల వర్షం..

16 జులై, 2026

iran
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 12:25 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • తొలిసారిగా టెహ్రాన్‌‌పై గురి

  • కేన్సర్‌ ఆసుపత్రి, చమురు ట్యాంకర్‌ సహా పలు ప్రాంతాలపై అమెరికా దాడులు

  • ఆటవిక దాడి అంటూ ఇరాన్‌ ఆగ్రహం

  • హర్మూజ్‌ దాటే నౌకల్లో భారతీయులు వద్దు

టెహ్రాన్‌, వాషింగ్టన్‌ : దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా వణికిపోతోంది. ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా దాడులు చేయగా ఇరాన్‌ కూడా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. ఇరాన్‌ నౌకాదళానికి, రివల్యూషనరీ గార్డులకు చెందిన కీలక స్థావరాలు వున్న ఓడరేవు పట్టణం బందర్‌ అబ్బాస్‌పై బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ అమెరికా దాడులు కొనసాగాయి. ఇరాన్‌ ఓడరేవులపై తాను విధించిన దిగ్బంధనాన్ని పట్టించుకోకుండా హర్మూజ్‌లో ప్రయాణిస్తూ ఇరాన్‌లోని ఖర్గ్‌ దీవి వైపు వెళుతున్న ఒక చమురు ట్యాంకర్‌పై అమెరికా వైమానిక దళం హెల్‌ఫైర్‌ క్షిపణులను (గగనతలం నుంచి భూమి పైకి ప్రయోగించేవి) ప్రయోగించింది. ఇవి చమురు ట్యాంకర్‌ చిమ్నీని తాకాయి. హెల్‌ఫైర్‌ క్షిపణి లేజర్‌ కిరణాలను అనుసరించి లక్ష్యాలను ఛేదిస్తుంది.

అర్ధర్రాతి వేళ కేన్సర్‌ ఆస్పత్రిపై...

తాజా దాడులలో తొలిసారిగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై కూడా అమెరికా గురి పెట్టింది. అహ్వాజ్‌లోని పిల్లల కేన్సర్‌ ఆస్పత్రి సమీప ప్రాంతాలపై క్షిపణులు పడ్డాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో రోగులు, వారి బంధువులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ‌కిమో థెరపీ తీసుకుంటున్న 211 మంది రోగులను తక్షణమే అక్కడ నుండి తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారులపై దాడిని పాశవికమైన, ఆటవికమైన దాడిగా ఇరాన్‌ అభివర్ణించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు చోటు చేసుకున్నాయి. చేతులకు ఐవిలు వున్న పిల్లలను చేతుల్లో ఎత్తుకుని బయటకు వెళ్ళడం కనిపించింది. కొంతమందిని స్ట్రెచర్‌‌లపై, వీల్‌ఛెయిర్లలో తీసుకెళ్ళారు. రోగుల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా హుటాహుటిన అందరినీ అక్కడ నుండి తరలించారని ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా తెలిపింది. ప్రాణాల కోసం పోరాడుతున్న అమాయకులైన చిన్నారులపై పిరికితనంతో పాల్పడిన యుద్ధ నేరం ఇదని విదేశాంగ శాఖ ప్రతినిధి బాఘై విమర్శించారు. మానవ హక్కుల కోసం నిరంతరంగా పోరాడేవారు ఇలా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే పట్టించుకోవడం లేదని విమర్శించారు.

​ఇరాన్‌‌లోని పలు నగరాల్లో పేలుళ్లు

​బందర్‌ అబ్బాస్‌తో పాటు రస్క్‌, ఛాబహార్‌, అహ్వజ్‌, కొనారక్‌, సిరిక్‌, ఖెష్మ్‌ సహా పలు ఇరాన్‌ నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. బాలిస్టిక్‌ క్షిపణుల తయారీకి, అంతరిక్ష కార్యక్రమానికి కేంద్రమైన సెమ్నమ్‌ రాష్ట్రంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఖెష్మ్‌, బందర్‌ ఇమామ్‌ ఖొమైనీ, బుషెహర్‌ సహా పలు దక్షిణ ప్రాంతాలలో సైతం పేలుడు శబ్దాలు వినిపించాయి. బుషెహర్‌లో పౌర అణు కేంద్రం ఉన్న విషయం తెలిసిందే. ఖెష్మ్‌లోని ఓ పారిశ్రామిక కేంద్రం దెబ్బతింది. టెహ్రాన్‌కు నైరుతి దిశగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాన్‌దాబ్‌లో కనీసం రెండు పేలుళ్లు జరిగాయని ప్రెస్‌ టీవీ తెలిపింది.

హర్మూజ్‌ ‌దాటే నౌకల్లో భారతీయులు వద్దు

అమెరికా దాడులను ఎదుర్కోవడానికి టెహ్రాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్‌ క్రియాశీలకం చేసింది. అమెరికా దాడులు ఉధృతం కావడంతో హర్మూజ్‌లో ప్రయాణిస్తున్న నౌకలలో సిబ్బందిని ఉంచవద్దని ఇరాన్‌ ఆదేశాలు జారీ చేసింది. నౌకలలో పనిచేసే సిబ్బందిని సరఫరా చేసే దేశాలలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది భారతీయ నావికులు, సిబ్బంది, ఇంజినీర్లు నౌకలలో పని చేస్తున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ హర్మూజ్‌లో ప్రయాణించే నౌకలలో భారతీయుల సేవలను ఉపయోగించుకోవద్దని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫిప్పింగ్‌ ఒక ప్రకటనలో ఆదేశించింది. గత మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

హౌతీలు పొంచి వున్నారు జాగ్రత్త!

వచ్చే వారం మరింత ఉధృతంగా వ్యవహరిస్తామని ఇరాన్‌ ‌విద్యుత్ నెట్‌‌వర్క్‌‌పై దాడులుచేస్తామని ట్రంప్‌ ‌హెచ్చరించిన నేపథ్యంలో ఒకవేళ అదేగనుక జరిగితే ఎర్ర సముద్రానికి సమీపంలోనే హౌతీలు వున్నారని ఇరాన్‌ ‌పేర్కొంది. ఎర్ర సముద్రానికి గేట్‌‌వేగా భావించే బాబ్‌ ఎల్‌ ‌మాండెబ్‌ ‌జలసంధికి సమీపంలో క్షిపణులు, డ్రోన్లను మోహరించడం ద్వారా నౌకలపై దాడులకు తాము పూర్తి సన్నద్ధంగా వున్నామని హౌతీలకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమ నుండి ఒక్క ఆదేశం వస్తే చాలు విరుచుకుపడతారని ఇరాన్‌ ‌పేర్కొంది.

అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా

ఇరాన్‌ కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అమెరికా లక్ష్యాలపై ప్రతిదాడులు చేసింది. బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌ల్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, ఇంధన నిల్వ కేంద్రాలపై కామికజ్‌ డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్‌ వైపు నుంచి వచ్చిన ఎనిమిది క్షిపణులను కూల్చేశామని జోర్డాన్‌ సైన్యం తెలిపింది. కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలలో ఉన్న రాడార్‌, రక్షణ వ్యవస్థలపై ఇరాన్‌ దాడులు చేసింది. కువైట్‌లోని అలీ అల్‌ సలేం స్థావరంలో ఉన్న అమెరికా రాడార్‌ వ్యవస్థలు, పాట్రియాట్‌ రక్షణ వ్యవస్థలు, ఇంధన ట్యాంకులపై దాడులు జరిగాయి. ఇదే స్థావరంలోని సీ-రామ్‌ ముందస్తు హెచ్చరికల రాడార్‌ పైన, అమెరికా సైనికులు సమావేశమయ్యే ప్రదేశం పైన దాడి చేశామని రివల్యూషనరీ గార్డులు తెలిపారు. బహ్రెయిన్‌‌లో షేక్‌ ఇసా స్థావరంలోని కమ్యూనికేషన్‌, రాడార్‌ వ్యవస్థలు కూడా ఇరాన్‌ దాడికి గురయ్యాయి. ఒప్పందం కుదరకపోతే వచ్చే వారం ఇరాన్‌ ‌విద్యుత్‌ ‌ప్లాంట్లు, వంతెనలే తమ లక్ష్యమంటూ ట్రంప్‌ ‌హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తమ దేశంలోని మౌలిక సదుపాయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని, గల్ఫ్‌ లోని అమెరికా ప్రాంతీయ భాగస్వామ్య దేశాల మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్‌ సైనిక ప్రతినిధి ఇబ్రహిం జోల్ఫఘరీ చెప్పారు. హర్మూజ్‌ ఒక రెడ్‌ లైన్‌ అని, దానిలో అమెరికా జోక్యాన్ని ఎప్పటికీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

చర్చల ఆలోచనే లేదు : ఇరాన్‌

అమెరికాతో చర్చలను తిరిగి ప్రారంభించే ఆలోచన ఏదీ లేదని ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘై స్పష్టం చేశారు. అమెరికా సైనిక దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడం పైనే ప్రస్తుతం దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. అమెరికాతో కుదుర్చుకున్న ఎంఓయూకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని తెలిపారు. ఎంఓయూలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అమెరికా విఫలమైందని, అందుకే తామిచ్చిన హామీలపై పునరాలోచన చేస్తున్నామని చెప్పారు.

ఖర్గ్‌ దీవి, పికాక్స్‌ పర్వతంపై ట్రంప్‌ గురి

ఇరాన్‌ ప్రధాన చమురు ఎగుమతి టెర్మినల్‌ అయిన ఖర్గ్‌ దీవిని స్వాధీనం చేసుకోవాలని, టెహ్రాన్‌ అణు కార్యక్రమంతో సంబంధం వుందని భావిస్తున్న పికాక్స్‌ పర్వత ప్రాంతంలోని భూగర్భ కేంద్రాలపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్‌పై ఒత్తిడి పెంచి, హర్మూజ్‌పై ఆ దేశ నియంత్రణను ఎలా బలహీనపరచాలన్న విషయంపై ట్రంప్‌ తన సీనియర్‌ సలహాదారులు, సైనికాధికారులతో తెర వెనుక మంతనాలు జరుపుతున్నారు. ఇరాన్‌ క్షిపణి ప్రయోగ వేదికలు, రాడార్‌ వ్యవస్థలు, ఇతర సైనిక ఆస్తులను ధ్వంసం చేసి ఆ తర్వాత పెద్ద ఎత్తున సైనిక చర్యలకు దిగాలని అమెరికా అధికారులు యోచిస్తున్నారు.

సౌదీకి అమెరికా ఆయుధాలు

సౌదీ అరేబియాకు 1.96 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. అమెరికా నుంచి 20వేల అత్యాధునిక ప్రెసిషన్‌ కిల్‌ ఆయుధ వ్యవస్థలను (సాధారణ రాకెట్లను లేజర్‌ గైడెడ్‌ ఆయుధాలుగా మార్చే వ్యవస్థ. ఇది సాధారణ రాకెట్‌ను ఐదు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల వద్దకు కచ్చితంగా చేరుస్తుంది), దాని వార్‌హెడ్లను సౌదీ అరేబియా కోరుతోంది. ఈ వ్యవస్థలు పరిమిత నష్టంతో లక్ష్యాలను ధ్వంసం చేస్తాయని అమెరికా నౌకాదళ వెబ్‌సైట్‌ తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్