శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌‌పై బాంబుల మోత..

1 గంట క్రితం

attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 12:58 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నివాసాలే లక్ష్యంగా అమెరికా క్షిపణుల వర్షం

- ఎనిమిది మంది మృతి

- చాబహార్‌ ఓడరేవుపై దాడి

- హర్మూజ్‌‌లో నిలిచిపోయిన నౌకల రవాణా

​‌టెహ్రాన్‌/వాషింగ్టన్‌ : పశ్చిమాసియా ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. అమెరికా సైన్యం ఇరాన్‌పై వరుసగా శుక్రవారం నాడు భారీ వైమానిక దాడులు నిర్వహించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధనౌకలతో ఇరాన్‌ ‌నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. తీర ప్రాంత నిఘా కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు, సైనిక సరఫరా వ్యవస్థలు, సముద్ర సామర్థ్యాలతో సహా డజన్ల కొద్దీ సైనిక లక్ష్యాలపై క్షిపణులతో దాడి చేసామని అమెరికా ‌ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు కొనసాగుతున్నాయని, పశ్చిమాసియాలో 50 వేలకు పైగా అమెరికా బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని యుఎస్‌ సెంట్రల్‌ ‌కమాండ్‌ పేర్కొంది.

చాబహార్‌ ఓడరేవుపై దాడి.. టవర్‌ ‌ధ్వంసం

చాబహార్ ఓడరేవుపై అమెరికా విరుచుకుపడింది. ఆప్ఘనిస్థాన్‌కు కీలకమైన వాణిజ్య మార్గంగా ఉన్న గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ తీరంలోని చాబహార్‌ ఓడరేవులోని టవర్‌ కూలిపోయింది. దక్ష‍ిణ ఓడరేవు నగరమైన బందర్‌ ఖమీర్‌లోని వంతెలనపై జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారని, అమెరికా దాడులో ఇప్పటివరకు 38 మంది మృతి చెందారని ఇరాన్‌ మీడియా తెలిపింది. అహ్వాజ్, కేష్మ్, బుషెహర్, దష్తి, బోస్తాన్, సిరిక్, బందర్-ఎ-లెంగే వంటి దక్షిణ తీర నగరాలు, ద్వీపాలను లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులకు తెగబడింది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, బందర్ అబ్బాస్‌లోని అల్లా అక్బర్ ప్రాంతంపై దాడి జరగగా, హర్మూజ్‌గన్ ప్రావిన్స్‌లో రోడ్డు, రైలు మార్గాలను లక్ష్యంగా చేసుకున్నారని ఇరాన్‌ ‌తెలిపింది. ఇరాన్‌షహర్ విమానాశ్రయంపై దాడితో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాబహార్ మారిటైమ్ కంట్రోల్ టవర్‌పై వరుస దాడలను అమెరికా చేస్తుంది. హర్మూజ్‌గన్ ప్రావిన్స్‌లో ఐదు వంతెనలు దెబ్బతిన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఇందులో బందర్ అబ్బాస్‌ను ఖ్మేయిర్, లార్‌లతో కలిపే గరీవెహ్ వంతెన కూడా ఉంది. దీంతో బందర్ అబ్బాస్ నుంచి ప్రయాణికుల రైళ్లను నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు ఏర్పాటు చేశారు. బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె ఒక్క సంవత్సరం వయసున్న బిడ్డ షెల్ గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్నట్టు ఇరాన్ ప్రభుత్వ సంస్థ తెలిపింది. ఈ దాడిలో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. పౌర, నివాస ప్రాంతాలపై అమెరికా దాడులు మానవ హక్కుల గురించి మాట్లాడేవారి ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతున్నాయని ఇరాన్ పార్లమెంటు జాతీయ భద్రతా కమిటీ చైర్మన్ ఎబ్రహీం అజీజీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాక్‌లోని సులైమానియాపై జరిగిన దాడిలో ఎనిమిది మంది కుర్దులు మృతి చెందారని కుర్దిస్తాన్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇరాన్ ప్రతినిధి తెలిపారు.

హర్మూజ్‌‌లో నిలిచిపోయిన నౌకల రవాణా

ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిణామం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జలసంధిని ఇరాన్ మూసివేయగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా చర్యలకు ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై దాడి చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ( ఐఆర్‌‌జిసి) ప్రకటించింది. క్షిపణి రక్షణ రాడార్, ఆయుధ గిడ్డంగులు, రెండు హిమార్స్ క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. అమెరికా చర్యల వల్ల హర్మూజ్‌ జలసంధి నుండి చమురు, గ్యాస్ ఎగుమతులు దాదాపు నిలిచిపోయాయని, ప్రతిదాడులు కొనసాగుతాయని ఐఆర్‌‌జిసి హెచ్చరించింది. ఒమన్‌లోని అమెరికా నిఘా రాడార్లను కూడా ధ్వంసం చేశామని పేర్కొంది. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ షాంఘైలో జరిగిన చర్చల్లో అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపునిచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్ని పక్షాలు పాటించాలని వాంగ్ యీ కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్