- జమ్మూకాశ్మీర్‌లోని దోడ జిల్లాలో ఘటన
- ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో దోడ జిల్లాలో తుపాకీ గాయాలతో ఒక సాధారణ పౌరుడు మృతి చెందడం సంచలనంగా మారింది. ఇదే ఘటనలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఒజి)కు చెందిన ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ ఘటన గురించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ప్రాథమిక నివేదికల ప్రకారం మృతుడు ఆరిఫ్ హుస్సేన్ చీకా గ్రామానికి చెందినవాడని తెలిసింది. ముందు జాగ్రత్త చర్యగా దోడ జిల్లాతో పాటు చీనబ్ లోయవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. జిల్లాలోని భదేర్వా పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో జై-గాండో రహదారిపై గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో ఆరిఫ్ హుస్సేన్‌కు తుపాకీ గాయాలయ్యాయి. వెంటనే దోడాలోని జిల్లాకు హుస్సేన్‌ను భద్రతా సిబ్బంది తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దోడా జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తన్వీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ‘శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలను ముగ్గుర్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. వీరిలో 35 ఏళ్ల వ్యక్తి అప్పటికే మృతి చెందాడు. అతనికి తుపాకీ తూటా గాయం ఉంది. మృతదేహానికి వైద్యుల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. నమూనాలను జమ్మూలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపాం. మిగతా ఇద్దరు రోగులకు ముఖం, తల, వీపుపై స్వల్ప గాయాలయ్యాయి’ అని తెలిపారు. ఎస్‌ఓజి బృందం ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.








కామెంట్‌లు (0)