గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాతావరణ మార్పుల వల్లే వరదలు

2 గంటల క్రితం

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 07:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 1,127కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య

- ప్రధాని బాలేంద్ర షా

ఖాట్మండ్ : నేపాల్‌లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,127కు చేరుకుంది. రసువాలో 45, నౌవాకోట్‌లో 155, ధాడింగ్‌లో 59 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. చిత్వాన్‌లో 348, గూర్ఖాలో 66, తనహున్‌లో 38, తూర్పు నవల్‌పరాసిలో 217, పశ్చిమ నవల్‌పరాసిలో 190 మృతదేహాలు లభ్యమయ్యాయి. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన మరో తొమ్మిది మంది మృతదేహాలను భారత్‌లో గుర్తించినట్టు నేపాల్‌ పోలీసులు తెలిపారు.

ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పులే కారణం

మరోవైపు, నేపాల్లోని వరదలకు వాతావరణ మార్పులే కారణమని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ధ్రువీకరించారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు పెరిగిందని నిర్ధరణ అయినందున, ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమన్నదానికి ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచవ్యాప్త సమస్య అని, దీనివల్ల కలిగే విపత్తులను ఎదుర్కోవడం కూడా ప్రపంచ బాధ్యత అని షా పేర్కొన్నారు.

​రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు

నేపాల్ వరద ప్రభావిత ప్రాంతంలో వర్షాలు పడటం నదుల నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ఫలితంగా సహాయచర్యలకు అంతరాయం కలుగుతోంది. నేపాల్‌లోని జల విద్యుత్తు ప్రాజెక్టుల టన్నెళ్ల నుంచి ఇప్పటిదాకా 280మందిని కాపాడారు. ఈ బృందాల్లో భారత్, చైనా నిపుణులున్నారు. టన్నెళ్లలో ఉన్నవారిని గుర్తించి బయటకు తీసుకొచ్చే పనిని రెండుదేశాల సిబ్బంది కలిసి చేపట్టారు. రసువాలోని మైలంగ్ ప్రాజెక్టు నుంచి పలువురిని ఈ బృందాలు రక్షించాయి. సొరంగ మార్గం మూసుకుపోయిన టన్నెల్లోకి ప్రవేశించేందుకు మరోవైపు కొండను బ్లాస్ట్ చేసి బాధితులను సహాయక బృందాలు రక్షించాయి.

​పెరుగుతున్న నదుల నీటిమట్టాలు

మరోవైపు, నేపాల్‌లోని తూర్పు, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో నదుల నీటిమట్టాలు పెరిగిపోతున్నాయి. సన్‌ కోశి, బుద్ధి గండకి, మహాకాళి నదులు ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలివెళ్లాలని నేపాల్‌ ప్రభుత్వం హెచ్చరిక జారీచేసింది. నువాకోట్, రసువా జిల్లాల్లో ఆకస్మిక వరదలకు అవకాశముందని ఆ దేశ జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు నిర్వహణ అథారిటీ అప్రమత్తం చేసింది. ఈ జిల్లాల్లో చిన్న నదుల్లో నీటి మట్టాలు, ప్రవాహాలు పెరుగుతున్నాయని తెలిపింది. తూర్పు మధ్య నేపాల్లోని టపుల్ జంగ్, సుంఖువసభ, సోలుకుంభ్,టంగ్, ఓఖదుంగా, రామెచాప్, డోలఖ, సింధుపాలౌచౌక్, కావ్రీపాలంచోక్, లలిత్ పుర్, భక్తపుర్, కాఠ్‌మండూ, ధాడింగ్ జిల్లాలకు వరద ముప్పు ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమ నేపాల్లోని గూర్ఖా లామ్ంగ్, డోల్పా, రుకుం తూర్పు, రుకుం పశ్చిమ, జజ్జర్కెట్, దార్చులా, బైతాది, డడేల్కుర, డోటి, కైలాలి, కంచన్పుర్ జిల్లాలకు సైతం వరదలు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. కోశీ, నారాయణి, బాగ్మతి, కర్నాలి, మహాకాలి, నదులు వాటి ఉపనదులు ప్రమాదకరంగా మారే అవకాశముందని తెలుస్తోంది.

​కంకాయ్, కమల, బబయి, తూర్పు రాప్తి, పశ్చిమ రాప్తి నదుల ప్రవాహాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రసువాలోని తైమూర్లో ప్రవాహాన్ని నేరుగా గమనించడానికి సిసిటివి కెమెరాలను అమర్చారు. ఈ వరదలకు కారణమైన గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల నుంచి పరిహారాన్ని కోరేందుకు నేపాల్ సిద్ధమైంది. అత్యధిక గ్రీన్‌హౌస్ ఉద్గారాలకు భారత్, చైనా, అమెరికాలే కారణమని నేపాల్‌ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పరిహారం కోరుతూ ఆయా దేశాలకు లేఖలు పంపామని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్