జెరూసలెం : ఈజిప్ట్ అధికారులతో చర్చల కోసం హమాస్ రాజకీయ విభాగం అధ్యక్షుడు ఖలీల్ అల్ హయ్యా శనివారం కైరోకు వెళ్లినట్లు హమాస్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఆదివారం ఉదయం ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ హసన్ రషద్‌తో సమావేశమవుతారని పేర్కొన్నాయి. ఖలీల్ అల్ హయ్యా జులై నెల చివరలో హమాస్ నాయకత్వాన్ని చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతినిధి జారెడ్ కుష్నర్ వచ్చేవారం ఇజ్రాయిల్, ఈజిప్టుల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.గాజా వ్యవహారాల్లో 'బోర్డ్ ఆఫ్ పీస్' ఉన్నత ప్రతినిధి నికోలే మ్లాడెనోవ్ కుష్నర్‌తో కలిసి రానున్నారు. హమాస్ తన ఆయుధాలను కొత్త పాలస్తీనా పాలక కమిటీకి అప్పగించడానికి అంగీకరించిన 15 అంశాల ప్రణాళికను నెతన్యాహూ ఇటీవల తిరస్కరించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆ ప్రణాళికకు కట్టుబడి ఉండేలా నెతన్యాహు, ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో మధ్యవర్తులు, అమెరికా వైపు నుండి చర్యల కోసం తాము ఎదురుచూస్తున్నామని హమాస్ రాజకీయ విభాగం సభ్యుడు బాసెమ్ నైమ్ శుక్రవారం మీడియాతో వెల్లడించారు.
మరోవైపు గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. శనివారం గాజాలోని వివిధ ప్రాంతాలలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడులు, ఫిరంగి దాడులు, కూల్చివేతల కారణంగా ఇద్దరు పాలస్తీనియన్లు మరణించగా, మరో 14 మంది గాయపడినట్లు ఆ ప్రాంత ఆరోగ్య శాఖ వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుండి గాజాలో ఇజ్రాయెల్ దాడుల వల్ల 1,250 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా అధికారిక వర్గాలు తెలిపాయి. 2023 అక్టోబర్ నుండి ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 73,300 దాటింది.





కామెంట్‌లు (0)