- కార్నెల్ యూనివర్సిటీ విద్యార్థుల భారీ ర్యాలీ
- బాధితురాలికి సంఘీభావం
ఇథాకా (న్యూయార్క్) : సామూహిక అత్యాచారానికి గురైన సహ విద్యార్థినికి సంఘీభావం తెలుపుతూ, రేపిస్టులపై ఐవీ లీగ్ పాఠశాల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన అమెరికాలో తీవ్ర సంచలనం కలిగించింది. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, క్యాంపస్లో జరిగే లైంగిక దాడులన్నింటికీ ఒకే విధమైన శిక్షలు విధించాలని, లైంగిక హింస-వేధింపుల ఫిర్యాదుల విషయంలో ఎలా స్పందించాలనే దానిపై క్యాంపస్ పోలీసులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కార్నెల్ వర్సిటీ అధ్యక్షుడు మైఖెల్ కోట్లికాఫ్, పాలనా యంత్రాంగంలోని ఇతర సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని కూడా వారు పట్టుపట్టారు. వీరి విధానాలు క్యాంపస్లో 'అత్యాచార సంస్కృతి'ని కొనసాగించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామూహిక అత్యాచార ఘటనతో సంబంధం ఉన్న ఏ విద్యార్థినైనా బహిష్కరించాల్సిందేనని, వారి డిగ్రీలను కూడా రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. 'ఒకే పోరాటం...ఒకే యుద్ధం', 'న్యాయం లేకుంటే శాంతి లేదు' అని నినాదాలు చేశారు. 'మేము బాధితుల పక్షాన నిలబడతాం', 'ఊరడింపు మాటలు కాదు...జైలు శిక్షలు కావాలి' అని రాసి ఉన్న ప్లకార్డులు ధరించారు.
ఘటనతో సంబంధమున్న క్యాంపస్ ఫ్రాటర్నిటీ సభ్యులపై సరైన విచారణ జరిపి వారిని శిక్షించడంలో విశ్వవిద్యాలయం విఫలమైందని బాధితురాలైన జేన్ డో (పేరు మార్చడం జరిగింది) ఆరోపించారు. 2024 అక్టోబరులో ఫ్రాటర్నిటీకి చెందిన అనేక మంది సభ్యులు తనకు మత్తుమందులు, మద్యం ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఈ మేరకు బాధితురాలు గత నెలలో ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో ఆమె వయసు 20 సంవత్సరాలు. ఏడుగురు ఫ్రాటర్నిటీ సభ్యులతో పాటు ఫ్రాటర్నిటీ ఛాప్టర్, స్థానిక బార్, తాను చదువుతున్న పాఠశాలను, దాని విశ్వవిద్యాలయాన్ని ఆమె తన దావాలో ప్రతివాదులుగా చేర్చారు. సంఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూనివర్సిటీ అధికారులు అంతర్గత విచారణ జరిపించారు. దర్యాప్తు సంస్థలు కూడా విచారణను చేపట్టాయి. అయితే ఈ కేసులో క్రిమినల్ అభియోగాలు మోపేందుకు స్థానిక ప్రాసిక్యూటర్ నిరాకరించారు. విచారణ నివేదికపై తాను తీసుకున్న చర్యలను కార్నెల్ సమర్ధించుకుంది. ఛాప్టర్ను మూసివేసింది. ఫ్రాటర్నిటీ సభ్యులపై బహిష్కరణ వేటు వేసింది. ఆంక్షలతో పాటు పలు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి యూనివర్సిటీ పాలకులు శిక్షలను తగ్గించుకునే అవకాశాన్ని కల్పించడాన్ని బాధితురాలు తప్పుపట్టారు. దావా వేసినప్పటి నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలు, ఆమె న్యాయవాది చెప్పారు.







కామెంట్లు (0)