టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు రెండుసార్లు జరిగాయని, రెండో దాడిలో ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి శిథిలాల నుంచి ఆయనను బయటకు తీసినట్లు ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సభ్యుడు మొహ్సెన్ హెయ్‌దారీ వెల్లడించారు. ఖతార్ టెలివిజన్ నెట్‌వర్క్ అల్ అరబీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ఈ వివరాలను ‘న్యూయార్క్ పోస్ట్’ వెల్లడించింది. ఈ వాదనను స్వతంత్రంగా ధ్రువీకరించిన ఆధారాలు మాత్రం వెలువడలేదు. మొదటి దాడిలో గాయపడిన మొజ్తబా ఖమేనీని ఇరాన్‌లోని ఓ వైద్య కేంద్రానికి తరలించినట్లు హెయ్‌దారీ తెలిపారు. అనంతరం టెహ్రాన్‌లోని మూడు ఆస్పత్రులపై దాడులు జరిగాయని, మూడో ఆస్పత్రిలో ఉన్న మొజ్తబా ఖమేనీని శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆయనను అజ్ఞాత ప్రాంతానికి తరలించారని, అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదని పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా మార్చి 8న మొజ్తాబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం నేతగా ఎంపిక చేసిన ప్రక్రియపైనా హెయ్‌దారీ వివరాలు వెల్లడించారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సమావేశానికి ముందు సభ్యులు తమ ఓట్లను కాగితంపై నమోదు చేశారని తెలిపారు. మొజ్తబా ఖమేనీ పేరును తొలుత ప్రతిపాదించింది తానేనని చెప్పారు. మొత్తం 59 ఓట్లలో మొజ్తబా ఖమేనీకి 50 ఓట్లు లభించగా, అయతొల్లా అలీరెజా అరాఫీకి ఎనిమిది ఓట్లు, ఒక ఓటు చెల్లకుండా లేదా దూరంగా ఉన్నట్లు తెలిపారు. కొత్త సుప్రీం నేత ఎంపికకు సంబంధించిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సెక్రటేరియట్ కార్యాలయంపైనా దాడి జరిగినట్లు హెయ్‌దారీ చెప్పారు. ఖోమ్‌లోని సెక్రటేరియట్‌పై జరిగిన బాంబు దాడిలో ఎనిమిది మంది మరణించారని, నాయకుడి ఎంపికకు సంబంధించిన పత్రాలు, సిఫార్సులు ధ్వంసమైనట్లు తెలిపారు.
మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే భిన్నమైన వాదనలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత నెలలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, అయితే మరణించలేదని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొజ్తబా ఖమేనీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. తాను ఆయనను ఇటీవల ప్రత్యక్షంగా కలిశానని, దాదాపు ఏడు గంటల పాటు చర్చలు జరిపామని తెలిపారు. ఈ భిన్న వాదనల నేపథ్యంలో మొజ్తాబా ఖమేనీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆయన ఆచూకీపై స్పష్టత లేకపోవడం కొనసాగుతోంది. ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఈ అంశంపై పలు కథనాలు వెలువడుతున్నాయి.
ఆస్పత్రి శిథిలాల నుంచి మొజ్తబా ఖమేనీని బయటకు తీశారు : నివేదిక
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 05:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)