శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎయిర్‌బస్ ఒప్పందం కేసులో శ్రీలంక మాజీ అధ్యక్షుడి కుమారుడు అరెస్టు

1 గంట క్రితం

srilanka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 06:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు, పార్లమెంట్ సభ్యుడు నమల్ రాజపక్సను ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది. 2013లో జరిగిన ఎయిర్‌బస్ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయనను అరెస్టు చేసినట్లు లంచం లేదా అవినీతి ఆరోపణలపై విచారణ కమిషన్ వెల్లడించింది. నమల్ రాజపక్సను ఎయిర్‌బస్ లావాదేవీకి సంబంధించి విచారణ కోసం పిలిపించిన అనంతరం అరెస్టు చేసినట్లు కమిషన్ అధికారులు తెలిపారు. అనంతరం ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. అయితే నమల్‌పై కచ్చితంగా ఏ ఆరోపణలు నమోదయ్యాయన్నది వెంటనే స్పష్టంగా తెలియలేదు. 2016లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసిన సుమారు 2.3 బిలియన్ డాలర్ల ఎయిర్‌బస్ ఒప్పందానికి సంబంధించిన దర్యాప్తులో ఈ అరెస్టు జరిగినట్లు నమల్ తరఫు న్యాయవాది నిశాంత్ దయానంద ధృవీకరించారు. ఈ వ్యవహారంలో మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సను కూడా కమిషన్ మే నెలలో ప్రశ్నించింది. ఎయిర్‌బస్ విమానాల కొనుగోలులో లంచాలు స్వీకరించారన్న ఆరోపణలపై ఆయనను అధికారులు విచారించారు. ఎయిర్‌బస్ సంస్థ నుంచి వచ్చిన నిధుల్లో కొంత భాగం శ్రీలంక ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు చేరిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే లంచాలు స్వీకరించారన్న ఆరోపణలను రాజపక్స కుటుంబం ఖండించింది. తమపై నమోదవుతున్న అవినీతి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొంది.

ఇదిలా ఉండగా, శ్రీలంక ఎయిర్‌లైన్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కపిల చంద్రసేన మార్చిలో దర్యాప్తు అధికారులకు కీలక వాంగ్మూలం ఇచ్చారు. తాను రాజపక్సకు సుమారు ఐదు లక్షల డాలర్ల లంచం చెల్లించినట్లు ఆయన తొలుత వెల్లడించారు. అయితే ఆ ప్రకటనను ఒత్తిడి కారణంగా ఇచ్చానని చెబుతూ అనంతరం వెనక్కి తీసుకున్నారు. చంద్రసేన మే నెలలో, మళ్లీ అరెస్టు కావడానికి కొద్ది రోజుల ముందు ఒక బంధువు ఇంట్లో మృతి చెందారు. ఆయన మరణానికి కారణం ఇప్పటికీ నిర్ధారణ కాలేదు.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అధికారుల సంయుక్త దర్యాప్తులో గతంలో ఎయిర్‌బస్ సంస్థ శ్రీలంకలో సుమారు 16 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించేందుకు అంగీకరించినట్లు తేలింది. అందులో సుమారు 1.7 మిలియన్ డాలర్లు చంద్రసేనకు చేరినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారం 2005 నుంచి 2015 వరకు మహింద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్యాబినెట్ ఆమోదంతో చేపట్టిన 10 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు సంబంధించినది.

కోర్టుకు సమర్పించిన నివేదికల ప్రకారం, 2013లో తాను రాజపక్సకు మూడు విడతల్లో 60 మిలియన్ శ్రీలంక రూపాయలు, అప్పటి మారకం విలువ ప్రకారం సుమారు 4.61 లక్షల డాలర్లు చెల్లించినట్లు చంద్రసేన తొలుత దర్యాప్తు అధికారులకు తెలిపారు. అయితే అనంతరం ఒత్తిడి కారణంగా ఆ ప్రకటన చేశానని చెబుతూ దానిని ఉపసంహరించుకున్నారు.

మరోవైపు, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంస్థకు దాదాపు 2 బిలియన్ డాలర్ల నష్టాలు పేరుకుపోగా, అప్పుల్లో కూరుకుపోయిన జాతీయ విమానయాన సంస్థను ప్రైవేటీకరించేందుకు చేపట్టిన పలు ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్