ఖాట్మండు : నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని గ్రామాలు, ప్రాజెక్ట్ సైట్ వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు బుధవారం తెలిపారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పర్వత ప్రాంత జిల్లా రసువాలోని స్యాప్రుబేసి, తిమురే ప్రాంతాలు వరదలతో తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. భోటే కోషి నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాలు, ప్రాజెక్ట్ సైట్ వరదలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందిందని జిల్లా అధికారి నరేంద్ర పరియార్ తెలిపారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుందని అన్నారు. సహాయక చర్యలను వేగవంతం చేశామని, పోలీసులు, సైన్యం, రక్షణ బృందాలు చర్యలు చేపడుతున్నట్లు ప్రధాని బాలేంద్రషా ఒక ప్రకటనలో తెలిపారు. దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు చెప్పారు. నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
టిబెట్‌లో పుట్టే భోటే కోషి నది నేపాల్‌లోని త్రిశూలి నదిలో కలుస్తుంది. త్రిశూలి నది అనంతరం గండక్ నదిగా భారత్‌లోకి ప్రవహిస్తుంది. గతేడాది భోటే కోషి నదిలో సంభవించిన వరదల్లో తొమ్మిది మంది మరణించగా, 24 మంది గల్లంతయ్యారు. నేపాల్-చైనాలను కలిపే ‘ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్’ కూడా కొట్టుకుపోవడంతో అనేక నెలలపాటు రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టిబెట్‌లోని హిమానీనద ప్రాంతంలో ఉన్న ఓ సరస్సు ఖాళీ కావడం వల్లే ఆ వరదలు సంభవించినట్లు ప్రాంతీయ వాతావరణ పర్యవేక్షణ సంస్థ తెలిపింది.








కామెంట్‌లు (0)