- ట్రంప్ ప్రకటన
- అంగీకరించామన్న హమాస్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని శాంతి మండలి రూపొందించిన గాజా శాంతి ఒప్పంద ముసాయిదాకు హమాస్ అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం, దశలవారీగా నిరాయుధీకరణ జరగాల్సి ఉండగా, దానికి అనుగుణంగా ఇజ్రాయెల్ కూడా గాజా నుండి వైదొలగుతుంది. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండవ దశ అమలు, ఇజ్రాయెల్ తన మొదటి దశను పూర్తిగా అమలు చేయడంపై ఆధారపడి ఉంటుందని హమాస్ పేర్కొంది. ఇందులో భాగంగా అన్ని దళాలను ఉపసంహరిం చుకోవడం, దాడులను నిలిపివేయడం వంటివి ఉన్నాయి.
ఆమోదయోగ్యం కాదు : ఇజ్రాయిల్
గాజా కోసం రూపొందించిన శాంతి ప్రణాళిక "ఇజ్రాయెల్‌కు ఆమోదయోగ్యం కాదు" అని, ఇజ్రాయెల్ "గెలిచే" వరకు గాజా స్ట్రిప్‌లో హమాస్ సభ్యుల "హత్యలు" కొనసాగాలని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ అన్నారు. ట్రంప్ ఈ ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని గంటలకే, మధ్య, ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక పాలస్తీనియన్ మరణించగా, మరికొందరు గాయపడ్డారు. నబ్లస్‌లోని జునైద్ పరిసర ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు, స్థిరనివాసుల దాడుల వల్ల నలుగురు పిల్లలతో సహా కనీసం 11 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. నగరానికి సమీపంలోని గ్రామాలలో, హెబ్రాన్, రమల్లా చుట్టుపక్కల కూడా దాడులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి.
శాంతిబోర్డు చారిత్రక ఒప్పందం : ట్రంప్
గాజాలో హమాస్, ఇతర సాయుధ గ్రూపులు ఆయుధాలు విడనాడాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘ఈ రోజు గాజాలో హమాస్, ఇతర సాయుధ గ్రూపులన్నీ పూర్తిగా ఆయుధాలను విడనాడాయి. శాంతి బోర్దు చారిత్రక ఒప్పందం కుదిర్చింది’ అని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. గాజాలో కార్యకలాపాలు సాగిస్తున్న మరో మిలిటెంట్ గ్రూప్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ మూవ్‌మెంట్ శుక్రవారం ఓ ప్రకటన చేస్తూ ఒప్పందం నివేదికలు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపింది. కాల్పుల విరమణలో హమాస్‌తో పాటు ఈ గ్రూపు కూడా భాగస్వామే.
శాంతి బోర్డు ఏం చెప్పింది?
హమాస్, ఇతర సాయుధ గ్రూపులు కమిటీకి ఆయుధాలు అప్పగిస్తాయని శాంతి బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. ముందుగా పోలీసు ఆయుధాల బదిలీ జరుగుతుందని, ఆ తర్వాత వ్యక్తిగత ఆయుధాల అప్పగింత పూర్తవుతుందని తెలిపారు. ‘ఒప్పందం అమలైతే హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలను అప్పగిస్తుంది. అధికారం తాత్కాలిక యంత్రాంగం చేతికి వస్తుంది. ప్రభుత్వం, పాలన నుంచి హమాస్ వైదొలుగుతుంది. ఇవన్నీ పాలస్తీనా ప్రజలకు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తాయి’ అని శాంతి బోర్డు ప్రతినిధి వివరించారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు : ట్రంప్
ఈ ఒప్పందం గాజాను నూతన పాలస్తీనా ప్రభుత్వం పాలించేందుకు వీలు కల్పిస్తుందని, అది శాంతి బోర్డుతో కలిసి పనిచేస్తుందని ట్రంప్ చెప్పారు. గాజా ఇకపై ఉగ్రవాద దాడులకు స్థావరంగా ఉపయోగపడకుండా ఇజ్రాయిల్‌కు భద్రత లభిస్తుందని అన్నారు. ఒప్పందాన్ని కుదర్చడంలో సాయపడిన ఈజిప్ట్, ఖతార్, టర్కీ మధ్యవర్తులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఒప్పందం అమలుకు సమయం పడుతుందని, రెండు వారాలలో షరతులను ప్రచురిస్తామని అధికారులు చెప్పారు.








కామెంట్‌లు (0)