- తదుపరి దశకు వెళ్తుంది: జేడీ వాన్స్
వాషింగ్టన్: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం రాబోయే నెలల్లో కొత్త దశలోకి ప్రవేశించే అవకాశం ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. అయితే తదుపరి దశలో అమెరికా ఎలాంటి చర్యలు చేపడుతుందో, సైనిక ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందో ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక సామర్థ్యాలను ధ్వంసం చేయడం యుద్ధం మొదటి దశ ప్రధాన లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని సాధించామని వాన్స్ పేర్కొన్నారు. ఇరాన్ తిరిగి తన సైనిక సామర్థ్యాలను పునర్నిర్మించుకోకుండా అడ్డుకోవడం రెండో దశ లక్ష్యమని, ఈ విషయంలోనూ అమెరికా గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు.
మరోవైపు, వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి మీదుగా ఇరాన్ వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయని వాన్స్ ఆరోపించారు. అయితే ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఏ నౌకను లక్ష్యంగా చేసుకున్నా అది విజయవంతం కాలేదని ఆయన పేర్కొన్నారు. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల సమయానికి యుద్ధం ముగుస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వాన్స్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, అమెరికా నిరంతరం రెచ్చగొడుతున్నప్పటికీ ఇరాన్ శాంతికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరాన్ దౌత్య మార్గాలను అన్వేషిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి తెలిపారు. అమెరికాతో సంఘర్షణను కొనసాగించాలనే ఆసక్తి ఇరాన్‌కు లేదని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించిన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అనంతరం హోర్ముజ్ జలసంధి మీదుగా నౌకాయానానికి సంబంధించి ఇరాన్ పలు ఆంక్షలు విధించింది. ఈ పరిణామాల మధ్య పశ్చిమాసియాలో సంఘర్షణను తగ్గించేందుకు వివిధ దేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.








కామెంట్‌లు (0)