సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

క్యూబాను మరో గాజాగా మార్చే కుట్ర

1 గంట క్రితం

cuba
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 12:59 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- ఒత్తిళ్లకు లొంగదు, సోషలిస్ట్ వ్యవస్థను కాపాడుకుంటాం : డియాజ్‌ కానెల్‌

- ముగిసిన 24వ అంతర్జాతీయ కమ్యూనిస్ట్, కార్మిక పార్టీల సమావేశాలు

​హవానా : క్యూబాను మరో గాజాగా మార్చే కుట్ర జరుగుతోందని ఆ దేశ అధ్యక్షులు డియాజ్‌ ‌కానెల్‌ ‌అన్నారు. హవానాలో రెండు రోజుల పాటు జరిగిన 24వ అంతర్జాతీయ కమ్యూనిస్ట్, కార్మిక పార్టీల (ఐఎంసిడబ్ల్యుపి)ల సమావేశాలు ఆదివారం ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా 49 కమ్యూనిస్ట్, కార్మిక పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ, వంద మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామ్రాజ్యవాద దురాక్రమణను ఐక్యంగా ఎదుర్కొవాలని ఆయన పిలుపునిచ్చారు.

క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ (పిసిసి) ఆతిథ్యమిచ్చిన ఈ సమావేశం, ‘‘ఫిడెల్ శత జయంతి సందర్భంగా క్యూబా విప్లవ వారసత్వాన్ని కాపాడటం, గౌరవించడం; సోషలిస్ట్ క్యూబాతో సంఘీభావాన్ని మరింత బలోపేతం చేయడం; మన సంయుక్త కార్యాచరణను పటిష్టం చేయడం; శాంతి కోసం, సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా మన శక్తులను ఏకం చేయడం’’ అనే నినాదాలతో నిర్వహించారు. ​అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో, పెరుగుతున్న సామ్రాజ్యవాద దురాక్రమణ పరిస్థితుల మధ్య, అంతర్జాతీయ పరిస్థితిని చర్చించడం, రాజకీయ సమన్వయాన్ని బలోపేతం చేయడం, సోషలిస్ట్ క్యూబాతో సంఘీభావాన్ని పునరుద్ఘాటించడం లక్ష్యమని ఈ సమావేశాలు స్పష్టం చేశాయి. క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ మొదటి కార్యదర్శి, క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డయాజ్-కానెల్ బెర్ముడెజ్ ముగింపు సమావేశానికి హాజరయ్యారు. పిసిసి పొలిట్ బ్యూరో సభ్యుడు, సంస్థాగత కార్యదర్శి రాబర్టో మొరాలెస్ ఒహెడా; పొలిట్ బ్యూరో సభ్యుడు, విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పారిల్లా; టర్కీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెమాల్ ఒకుయాన్ ప్రెసిడియంలో ఉన్నారు. ఈ సమావేశం పలు తీర్మానాలను, తుది పత్రాన్ని ఆమోదించింది.

ఫాసిజం తిరిగి పుంజుకుంటోంది : క్యూబా అధ్యక్షుడు డియాజ్‌ ‌కానెల్‌

ఈ సమావేశాలు ముగింపు సందర్భంగా క్యూబా అధ్యక్షుడు డియాజ్‌ ‌కానెల్‌ ప్రసంగించారు. నేడు ప్రపంచ పరిస్థితుల్లో జాతీయవాదం, జాతీ ఆధిపత్యం వంటి పోకడలతో ఫాసిజం తిరిగి పుంజుకుంటుందని కానెల్‌ ‌హెచ్చరించారు. సంపద కేంద్రీకరణ, పెరుగుతున్న అసమానతలు, పర్యావరణ విధ్వంసం, మార్కెట్లు-వనరులు-ప్రభావ రంగాల కోసం జరుగుతున్న యుద్ధాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని అత్యంత అనిశ్చిత, ప్రమాదకర దశల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు గుత్తాధిపత్య, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం మూలకారణమన్నారు. ‘‘ఈ సంక్షోభాలు యాదృచ్ఛిక సంఘటనలు కావు, గుత్తాధిపత్య, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి నియమాల ఫలితమేనని నిరూపిస్తున్నందున మార్క్సిజం-లెనినిజం ఇప్పటికీ పూర్తిగా చెల్లుబాటు అవుతోంది ’’ అని ఆయన అన్నారు. అలాగే, తీవ్ర ఒత్తిడులు, ఇబ్బందుల మధ్య కూడా క్యూబాకు ప్రయాణించి వచ్చిన ప్రతినిధి బృందాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ దాడి వల్ల జరిగిన విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించిన డయాజ్-కానెల్, దీనిని క్యూబాపై కొనసాగుతున్న దురాక్రమణతో అనుసంధానం చేశారు. ‘‘గాజాలో జరుగుతున్న మారణహోమం, దాని సిగ్గుమాలిన బహిరంగ ప్రదర్శన వారికి సరిపోదు; దూకుడు, నేరపూరిత విధానం ద్వారా క్యూబాలోనూ అదే చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఒత్తిళ్లకు క్యూబా లొంగదని, తన స్వాతంత్ర్యాన్ని, సోషలిస్ట్ వ్యవస్థను కాపాడుకోవడం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘పెట్టుబడిదారీ అనాగరికత ఎదుట సోషలిజమే ఇప్పటికీ వాస్తవికమైన, మానవీయమైన ఏకైక మార్గం’’ అని ఆయన పేర్కొన్నారు.

సామ్రాజ్యవాద పాలనే కల్లోలానికి కారణం...

తన ప్రారంభోపన్యాసంలో టర్కీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెమాల్ ఒకుయాన్, అమెరికా ఆంక్షల వల్ల ఎదురైన కష్టాల నడుమ కూడా హవానాలో సమావేశాన్ని నిర్వహించినందుకు క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫిడెల్ కాస్ట్రో రాజకీయ, మేధోపరమైన వారసత్వం ఈ సమావేశానికి కేంద్ర బిందువుగా ఉందని పేర్కొన్నారు. ఫిడెల్ జీవితం వివిధ దశల గుండా సాగినప్పటికీ, శత్రువుకు ఎన్నడూ లొంగకపోవడం, విప్లవ ఆదర్శాలను వదులుకోకపోవడం, అత్యంత బలమైన నైతిక వైఖరిని కొనసాగించడం అనే మూడు లక్షణాలు స్థిరంగా కొనసాగాయని ఒకుయాన్ తెలిపారు.

క్యూబా విప్లవం విదేశీ జోక్యం వల్ల జరిగిందన్న వాదనలను తోసిపుచ్చుతూ, నిజమైన విప్లవాలు సమాజాల అంతర్గత చైతన్యం, పోరాటాల నుంచే పుడతాయని ఆయన స్పష్టం చేశారు. బహుళజాతి గుత్తాధిపత్య సంస్థలు, నాటో, సామ్రాజ్యవాద యుద్ధాలు, దోపిడీ, సామ్రాజ్యవాదులు మద్దతిచ్చే నియంతృత్వ పాలనలే అసలైన కల్లోలానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రతి దేశంలో స్వతంత్ర విప్లవ నాయకత్వం అవసరమని కమ్యూనిస్టులు అంతర్జాతీయవాదులని కూడా ఆయన నొక్కిచెప్పారు. ప్రస్తుత ప్రపంచ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, పెట్టుబడిదారీ వ్యవస్థకు కొనసాగింపు లభిస్తున్నంత కాలం విపత్తు మరింత తీవ్రమవుతుందని ఆయన హెచ్చరించారు.నిరుద్యోగ యువత, పింఛనుదారులు, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలకు స్పందించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, క్యూబాపై ఆంక్షలు, దురాక్రమణ ముగియాలని, ‘‘కమ్యూనిజం వర్ధిల్లాలి! ఫిడెల్ వర్ధిల్లాలి!’’ అనే నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించారు.

​ఆంక్షల నడుమ సమావేశం : రాబర్టో మొరాలెస్

​ ఇంధనం, మందులు, ఆహారం, విడిభాగాలు, పెట్టుబడులు, రుణాలు వంటి జాతీయాభివృద్ధికి అవసరమైన కీలక వనరుల లభ్యతను తీవ్రంగా పరిమితం చేస్తున్న ఆర్థిక, వాణిజ్య, ఆర్థిక ఆంక్షలను క్యూబా ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఈ సమావేశం జరుగుతోందని రాబర్టో మొరాలెస్ ఒహెడా పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, దేశంపై ఒత్తిడిని పెంచడం లక్ష్యంగా విధించిన ఈ ఆంక్షలను ఆయన ఖండించారు. మందులు, వైద్య సామగ్రి కొరత కారణంగా క్యూబా ఆరోగ్య వ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతోందని కూడా ఆయన వివరించారు.

​పాలస్తీనా, క్యూబాలకు సంఘీభావం

‘గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ, పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ సమావేశం తీర్మానం చేసింది. పాలస్తీనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి ఇహాబ్ మస్ఫీ, అమెరికా ఏకపక్ష ‘ఉగ్రవాద మద్దతు దేశాల జాబితా’ నుంచి క్యూబాను తొలగించాలని, అమెరికా ఆంక్షలను వెంటనే ముగించాలని డిమాండ్ చేశారు. గాజాలో మారణహోమం, జాతి ప్రక్షాళన, వ్యవస్థాగత ఆకలిదప్పులు కొనసాగుతున్నాయని, ఆ ప్రాంతంలో ఫాసిస్ట్, జియోనిస్ట్ శక్తుల పాత్ర పెరుగుతోందని ఆయన హెచ్చరించారు.

వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వు థాయ్ థా, ఆంక్షలు, ఇంధన పరిమితుల నేపథ్యంలో క్యూబా ప్రజలకు తమ దేశం అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. "క్యూబాకు మద్దతివ్వడం మనస్సాక్షికి, బాధ్యతకు సంబంధించిన విషయం" అని పేర్కొంటూ, హోచిమిన్ వారసత్వం, శ్రామికవర్గ అంతర్జాతీయవాద సంప్రదాయంతో వియత్నాం సంఘీభావాన్ని వివరించారు. ఈ సమావేశాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తరఫున పొలిట్ బ్యూరో సభ్యులు, అంతర్జాతీయ విభాగం అధిపతి ఆర్ అరుణ్ కుమార్ ప్రాతినిధ్యం వహించారు.

కమ్యూనిస్ట్, కార్మిక పార్టీల మధ్య ఐక్యత, క్యూబాకు బలమైన అంతర్జాతీయ సంఘీభావం, సామ్రాజ్యవాదం-వలసవాదం-ఫాసిజంలకు వ్యతిరేకంగా సమన్వయ కార్యాచరణకు పిలుపునిస్తూ ఈ సమావేశం ముగిసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్