- సామ్రాజ్యవాద, నయా-ఫాసిస్టు చర్యలుగా అభివర్ణించిన క్యూబా
వాషింగ్టన్: క్యూబా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచే దిశగా అమెరికా ప్రభుత్వం కొత్త ఆంక్షలను ప్రకటించింది. క్యూబాలో కొనసాగుతున్న ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసేలా చమురు, విద్యుత్ రంగాలకు సంబంధించిన సరఫరాలపై ఆంక్షలు విధించింది. దీంతో విద్యుత్ వ్యవస్థకు అవసరమైన సాంకేతిక పరికరాలు, విడిభాగాల దిగుమతులకు కూడా ఆటంకం కలుగుతుంది. విద్యుత్ రంగానికి అవసరమైన పరికరాలు, విడిభాగాలను దిగుమతి చేసుకునే అబాపెట్‌పై అమెరికా పూర్తి నిషేధం విధించింది. ఇప్పటికే పాత పవర్ గ్రిడ్‌లతో విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు క్యూబా తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా ఆంక్షలు ఆ దేశ ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది.
కాగా, క్యూబాపై ఆంక్షల వెనుక ఉన్న అమెరికా ఉద్దేశ్యాన్ని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బహిరంగంగా వెల్లడించారు. క్యూబాలో పాలన మార్పు, కమ్యూనిస్టు పాలనకు ముగింపు పలకడమే తమ లక్ష్యమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులను కూడా ఆంక్షల పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూబాను తమ ఆధీనంలోకి తీసుకునే విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాను నిశ్చయంతో ఉన్నామని రూబియో పేర్కొన్నారు. నెలల తరబడి క్యూబా, అమెరికాల మధ్య జరుగుతున్న ప్రాథమిక చర్చలను రద్దు చేయడమే ఈ చర్య యొక్క ఉద్దేశ్యం. మరోవైపు, అమెరికా చర్యలను క్యూబా తీవ్రంగా ఖండించింది. ఆ దేశంపై అమెరికా కొనసాగిస్తున్న ఆర్థిక ఒత్తిడి ప్రజల జీవన పరిస్థితులను మరింత దిగజార్చే చర్యగా క్యూబా అధికారులు విమర్శించారు. క్యూబా విదేశాంగ మంత్రి ఆస్కార్ పెరెజ్ ఒలివా ఫ్రాగా దీనిని ఆర్థిక విధ్వంస ప్రయత్నంగా అభివర్ణించారు. క్యూబా ప్రజల్లో అసంతృప్తిని పెంచి తిరుగుబాటుకు పరిస్థితులు సృష్టించడమే ఆంక్షల ఉద్దేశ్యమని మెక్సికోలోని క్యూబా రాయబారి యూజీనియో మార్టినెజ్ ఎన్రిక్వెజ్ విమర్శించారు. అమెరికా చర్యలను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ, వాటిని సామ్రాజ్యవాద, నయా-ఫాసిస్టు చర్యలుగా అభివర్ణించారు.







కామెంట్‌లు (0)