మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పసిపిల్లలకు పాలు పట్టే వసతి కరువాయే !

1 రోజు క్రితం

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 10:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- తాగునీరు, ఆహారం లేక విలవిల

- నేపాల్‌ వరద బాధిత శిబిరాల్లో హృదయవిదారక కష్టాలు

ఖాట్మండ్‌ : నేపాల్‌ వరద బాధిత శిబిరాల్లో హృదయవిదారక కష్టాలు నెలకొన్నాయి. జలప్రళయ ధాటికి సర్వం కోల్పోయి..బతుకుజీవుడా అంటూ శిబిరాల్లో తలదాచుకున్న అభాగ్యులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. ముఖ్యంగా పసిపిల్లలకు బాలింతలు పాలు ఇచ్చేందుకు కూడా సరైన వసతి లేకపోవడం, పిల్లలకు ఆహారం అందుబాటులో లేకపోవడం, మరోవైపు గర్భిణులకు ఆస్పత్రులకు చేరుకోవడం చాలా కష్టంగా ఉంది. ఖాట్మండ్‌లోని సహాయక శిబిరాల్లో భాగంగా 33 ఏళ్ల వయసున్న శర్మిలా శ్రేష్ఠ తన పసిపాపతో కలిసి ఒక క్లాస్ రూంలో నేలమీదనే నిద్రిస్తోంది. వీరికి తోడు మరో ఏడాదిన్నర వయసున్న చిన్నారి కూడా ఉంది. ఈ పసి పిల్లలకు సరైన పౌష్టికాహారం అక్కడ శిబిరాల్లో అందుబాటులో లేదు. ఆకస్మిక వరదల భీభత్సంలోనే శర్మిల తొలుత తన పసిపాపను కోల్పోయారు. కొండలు గుట్టల్లోనే గంటల పాటు నడిచింది. 2-3 రోజులకు ఎట్టకేలకు తన కుమార్తెను కలుసుకోగలిగింది. అయినా ఇప్పుడు పిల్లలకు సరైన ఆహారం అందుబాటులో లేదని ఆవేదన చెందుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తన చిన్నపిల్లలకు సరైన ఆహారం, వసతి మాత్రమే తాను కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.

పాలివ్వడమే చాలా కష్టంగా ఉంది!

ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా తల్లులకు పరిస్థితులు అనుకూలించట్లేదు. సహాయక శిబిరాల్లో వందలాది మంది ఒకేచోట ఉండటంతో నవజాత శిశువులకు పాలు ఇవ్వడం చాలా కష్టంగా మారుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అక్కడే ఎక్కువ మంది జనం మధ్య ఉండటం కష్టంగా ఉందని, కొందరు సిగరెట్లు, మద్యం తాగుతుండటం వల్ల కూడా పిల్లలు పడుకోలేకపోతున్నారని చెబుతున్నారు. రసువా, ధాదింగ్, నువాకోట్ ఈ మూడు జిల్లాల్లో దాదాపు నాలుగు వేల మందికిపైగా గర్భిణులు ఉన్నట్లు ఐరాస విభాగం యుఎన్‌ఎఫ్‌పిఎ అంచనా వేసింది. వచ్చే నెలలో దాదాపు 500 వరకు ప్రసవాలు జరగాల్సి ఉందని పేర్కొంది. మరోవైపు వరదల కారణంగా విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో ఆస్పత్రుల్లో వైద్యులు రోగులకు సరిగా చికిత్స కూడా అందించలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో జనరేటర్లు కూడా అందుబాటులో లేవని త్రిశూలి జిల్లా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక అవసరాలు ఉండే బాలింతలు, గర్భిణులు, పసిపిల్లలను వేరుగా ప్రత్యేక శిబిరాల్లో ఉంచాల్సిన అవసరం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు.

ఇద్దరు సోదరీమణుల్ని కోల్పోయా

నేపాల్ రసువా జిల్లాలో 16 ఏళ్ల సమీర్ తమాంగ్ తన ఇద్దరు సోదరీమణుల్ని కోల్పోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు. తన చిన్న చెల్లి పార్వతికి (7) చేతికి గాయం కావడంతో ఆమె స్కూల్‌కు రాలేకపోయిందని, తనతో పాటు తన పెద్ద చెల్లి ప్రియ (13) కూడా ఇంట్లోనే ఉండిపోయిందని చెప్పాడు. వరద ప్రభావానికి తమ ఇల్లు కొట్టుకుపోయిందని, ఇప్పుడు వారిద్దరినీ తాను కోల్పోయినట్లు చెప్పాడు. మరోవైపు వరదల్లో కొట్టుకొచ్చిన బంగారం, వెండి, నగదు, ఇతర విలువైన వస్తువులను తమ దగ్గర ఉంచుకోవడం లేదా అమ్మడం లాంటివి చేయొద్దని నేపాల్ పోలీసులు ప్రజల్ని కోరారు. సమీప పోలీస్ కార్యాలయాల్లో అప్పగించాలని సూచించారు. ముఖ్యమైన పత్రాలు ఏమైనా ఉన్నా వాటిని తిరిగి అసలైన యజమానులకు అందించడంలో సహాయం చేయాలని స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్