- నేపాల్ విషాదంలో అద్భుతం
- 9 రోజుల తర్వాత క్షేమంగా బయటకు
ఖాట్మండు : నేపాల్ జల ప్రళయం మిగిల్చిన విషాదంలో శుక్రవారం ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఆకస్మిక వరదలతో వందలు వేల సంఖ్యలో మరణాలు సంభవించడం, వేలాదిమంది గల్లంతైన నేపథ్యంలో తమవారి ఆచూకీ కోసం గత 9 రోజులుగా బాధితులు కళ్ళు కాయలు చూసేలా ఎదురుచూశారు. ఇక వారు బతికి వుండే ఆశలు లేవని కొంతమంది అంత్యక్రియలకు కూడా సిద్ధపడుతున్నారు. ఈ దశలో నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకుపోయి ఇద్దరు ఉద్యోగులు బతికి బయటపడడంతో సొరంగాల్లో చిక్కుకుపోయిన వారి పట్ల చిన్న ఆశ పొడసూపుతోంది. బలహీనంగా వున్న ఆ స్వరంతోనే... భోటేకోశి నదికి వచ్చిన మెరుపు వరదలతో రసువా జిల్లాలోని త్రిశూలి 3ఎ జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకుపోయిన ఇద్దరిని శుక్రవారం నేపాల్ ఆర్మీ, అధికారులు కాపాడారు. వారిని కబీర్ మహార్జన్ (45), సంజయ్ షా (30)గా గుర్తించారు. వీరిలో మహర్జన్ ప్రాజెక్టులో మెకానికల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా షా ఫోర్‌మన్‌గా వున్నారని నేపాల్ ఆర్మీ పిఆర్‌ఓ కార్యాలయం వెల్లడించింది. ప్రత్యేక పరికరాలను ఉపయోగించి నేపాల్ ఆర్మీ నేతృత్వంలో సెక్యూరిటీ కమాండ్ పెద్ద ఎత్తున గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొంటోంది. గాలింపు చర్యలు ఉధృతంగా కొనసాగుతున్న దశలో సొరంగం లోపల శిధిలాల దిబ్బల వెనుక నుండి బలహీనంగా ఒక గొంతు వినిపించిందని ఆర్మీ తెలిపింది. ఆసలు ఆ సొరంగంలో ఎవరైనా బతికి వున్నారా లేదా అనే అనుమానంతో గాలిస్తుండగా ఈ గొంతు వినిపించడంతోనే వారిని చేరుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ గొంతు వినిపిస్తున్న దిశగా లోపలకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సహాయక బృందం లోపలకు చొరబడి వారిని గుర్తించిందని ఖాట్మండు పోస్ట్ తెలిపింది. బయటకు తీసుకువచ్చిన వెంటనే వారిద్దరిని ఖాట్మండులోని రెండు ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సొరంగంలో 170 మీటర్ల లోతు నుండి వారిని కాపాడినట్లు ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇదిలావుండగా నేపాల్ మృతుల సంఖ్య 1259కి చేరింది. గల్లంతైన వారి సంఖ్య 5083కి చేరిందని అధికారులు తెలిపారు. ఇంకా శిధిలాల తొలగింపులో మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం వుందని భావిస్తున్నారు.








కామెంట్‌లు (0)