వాషింగ్టన్ (అమెరికా) : అమెరికా సెనెటర్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన లిండ్సే గ్రాహం (71) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. అయితే ఆయన అనారోగ్యానికి గల కారణాలను వెల్లడించలేదు.
2003 నుంచి అమెరికా సెనేట్‌లో సౌత్ కరోలినా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రాహం జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి అంశాలపై కీలక పాత్ర పోషించారు. అమెరికా రాజకీయాల్లో ప్రభావశీల రిపబ్లికన్ నేతగా గుర్తింపు పొందిన ఆయన, డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయ రాజకీయ మద్దతుదారుల్లో ఒకరిగా నిలిచారు.
పాకిస్థాన్‌పై విమర్శలు ....
ఇటీవల అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ... పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను గ్రాహం తీవ్రంగా విమర్శించారు. ఇస్లామాబాద్ మధ్యవర్తిగా వ్యవహరించడమే ప్రధాన సమస్య అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌పై పాకిస్థాన్‌కు చాలా కాలంగా ప్రతికూల వైఖరి ఉందని పేర్కొన్నారు. గతంలో ఆ దేశ ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయని అన్నారు. అబ్రహాం ఒప్పందాల్లో పాల్గొనబోమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అవి ఆందోళనకరమని చెప్పారు. ట్రంప్ పిలుపు మేరకు అబ్రహాం ఒప్పందాలపై పాకిస్థాన్ స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
2016లో అధ్యక్ష అభ్యర్థిత్వం ....
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి గ్రాహం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ప్రాథమిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే 2015 డిసెంబరులో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. తొలుత ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించిన ఆయన, అనంతరం ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా, బలమైన రాజకీయ మద్దతుదారుగా మారారు.








కామెంట్‌లు (0)