- భారతీయ కుటుంబాలపై ప్రభావం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కల్పిస్తున్న హెచ్-4 వీసా ఆధారిత ఉద్యోగ అనుమతులను(ఈఎడి) తొలగించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం 2015లో హెచ్-4 వీసాదారుల్లో కొందరికి ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఎడి) ద్వారా అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసే అవకాశం కల్పించింది. ముఖ్యంగా గ్రీన్ కార్డ్ ప్రక్రియలో నిర్దిష్ట దశకు చేరుకున్న హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే అర్హత కలిగిన హెచ్-4 ఈఎడి హోల్డర్లు అమెరికాలో ఉద్యోగాలు చేసే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు.
హెచ్-4 వీసా సాధారణంగా హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు అవివాహిత పిల్లలకు జారీ చేస్తారు. అయితే ప్రతి హెచ్-4 వీసాదారుడికి ఆటోమేటిక్‌గా పని చేసే హక్కు ఉండదు. నిర్దిష్ట అర్హతలు ఉన్న జీవిత భాగస్వాములు ఈఎడి పొందిన తర్వాతే అమెరికాలో ఉద్యోగం చేయగలరు.
హెచ్-4 ఈఎడి హోల్డర్లలో భారతీయుల వాటా అధికంగా ఉండటంతో ఈ ప్రతిపాదనతో భారతీయ కుటుంబాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో జీవన వ్యయం అధికంగా ఉండటంతో అనేక హెచ్-1బీ కుటుంబాలు ఇద్దరి ఆదాయాలపై ఆధారపడుతున్నాయి. మరోవైపు, గ్రీన్ కార్డ్ కోసం భారతీయులు అనేక సంవత్సరాలు వేచి ఉండాల్సి రావడంతో, హెచ్-4 ఈఎడి ద్వారా జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేయడం కుటుంబాలకు కీలకంగా మారింది.
యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న విదేశీయులలో సుమారు 70 శాతం మంది భారతీయులే. హెచ్-4 దరఖాస్తుదారులలో 93 శాతం మంది భారతీయులే. అమెరికాలో అధిక జీవన వ్యయాన్ని తట్టుకోవడానికి వీరిద్దరూ పని చేయవలసి ఉంటుంది. గ్రీన్ కార్డ్ పొందడానికి సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి రావచ్చు. కొత్త హెచ్-1బీ దరఖాస్తులపై భారీ రుసుములు విధించడం, ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఇచ్చే 60 రోజుల గడువును రద్దు చేయడం వంటి ప్రతిపాదనలు ఇప్పటికే చర్చలో ఉన్నాయి. ఈ చర్య ద్వారా రూ.1 కోటి రుసుము విధించనున్నారు. ఈలోగా, భారతీయుల కుటుంబాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు.








కామెంట్‌లు (0)