- డిసెంబర్ నుంచి కొత్త నిబంధనలు
- హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, జిమ్‌లకు వర్తింపు
అబుదాబి: బహిరంగ ప్రదేశాల్లో సంగీతాన్ని వినిపించేందుకు యూఏఈ ప్రభుత్వం లైసెన్స్ ఫీజును ప్రవేశపెట్టనుంది. పర్యాటక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లతో పాటు బహిరంగ కార్యక్రమాల్లో సంగీతాన్ని ప్రదర్శించడం, పాటలు పాడేందుకు కూడా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. లైసెన్స్ ఫీజులను వసూలు చేసే బాధ్యతను ఎమిరేట్స్ మ్యూజిక్ రైట్స్ అసోసియేషన్, మ్యూజిక్ నేషన్ అనే రెండు సంస్థలకు అప్పగించారు. ప్రతి సంవత్సరం లైసెన్స్ జారీ చేయనున్నారు. అయితే వివిధ ప్రాంతాలు, సంస్థల ఆధారంగా వర్తించే లైసెన్స్ ఫీజు వివరాలను తరువాత ప్రకటించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో సంగీతాన్ని వాయించడం, సంగీత కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యకలాపాలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. సంగీత హక్కులకు సంబంధించిన రుసుములను వసూలు చేయడం ద్వారా కళాకారులు, సంగీత సృష్టికర్తల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే అన్ని కార్యక్రమాలకు ఈ నిబంధన వర్తించదు. విద్యా, ప్రభుత్వ సంస్థల్లో నిర్వహించే కార్యక్రమాలు, వ్యక్తిగత కార్యక్రమాలు, ఇతర వాణిజ్యేతర కార్యక్రమాలకు లైసెన్స్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
డిసెంబర్ నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో సంబంధిత వ్యాపార సంస్థలు, ఈవెంట్ నిర్వాహకులు ముందుగానే లైసెన్స్ నిబంధనలు, ఫీజుల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.








కామెంట్‌లు (0)