ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డ్రోన్లతో విధ్వంసం

1 గంట క్రితం

attack on russia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 09:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్‌

- కాలిబూడిదైన గిడ్డంగులు... భారీగా నష్టపోయిన వ్యాపారులు

మాస్కో : రష్యాపై ఉక్రెయిన్‌ భీకర వైమానిక దాడులు జరిపింది. గిడ్డంగులు, పారిశ్రామిక ప్లాంట్లు, రిఫైనరీలు సహా రష్యాకు చెందిన పలు లక్ష్యాలపై వందలాది డ్రోన్‌లతో ఆదివారం రాత్రి విరుచుకుపడింది. ఈ దాడులలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌ జరిపిన అతి పెద్ద డ్రోన్‌ దాడి ఇదేనని రష్యా ప్రభుత్వం తెలియజేసింది. ఉక్రెయిన్‌ ప్రయోగించిన 800 డ్రోన్లను కూల్చివేశామని మాస్కో గవర్నర్‌ ఆండ్రే ఓరోబియేవ్‌ చెప్పారు. మాస్కో ప్రాంతం పైకి దూసుకొచ్చిన 187 డ్రోన్లను గగనతల రక్షణ దళాలు, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ యూనిట్లు తటస్థం చేశాయని ఆయన తెలిపారు. రాజధాని మాస్కోలో సంపన్నులు అధికంగా నివసించే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి జరిపింది. మాస్కో ప్రాంతంలో ఆదివారం జరిగిన డ్రోన్‌ దాడిలో 83 సంవత్సరాల వృద్ధుడు చనిపోయాడు.

ఉక్రెయిన్‌ దాడుల కారణంగా మాస్కో ప్రాంతంలోని అతి పెద్ద వైల్డ్‌బెర్రీస్‌ గిడ్డంగుల వద్ద భారీగా మంటలు వ్యాపించాయి. ఆకాశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. ఎలక్ట్రోస్టాల్‌, కొలెడినో ప్రాంతాలలోని గిడ్డంగులు మంటలలో కాలిపోయాయి. దాచుకున్న సరుకు బూడిదైపోవడంతో వ్యాపారులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఆన్‌లైన్‌ వ్యాపారులు సరఫరాలను నిలిపివేశారు. ఇటీవలి కాలంలో వైల్డ్‌బెర్రీస్‌ గిడ్డంగులను ఉక్రెయిన్‌ సేనలు లక్ష్యంగా చేసుకొని పదే పదే దాడులు జరిపాయి. దీంతో పొరుగున ఉన్న కజక్‌స్థాన్‌లో కొత్త గిడ్డంగిని నిర్మించామని కంపెనీ కొద్ది కాలం క్రితమే ప్రకటించింది. ఉక్రెయిన్‌ నుంచి 17 ప్రాంతాల వైపు... ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ ప్రాంతాల వైపు వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడుల కారణంగా దక్షిణ రష్యాలోని రోస్తావ్‌లో ఐదుగురు మరణించారు.

​కీవ్‌పై రష్యా ప్రతి దాడులు

రష్యా కూడా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై డ్రోన్‌, క్షిపణి దాడులు జరిపింది. ఆదివారం ఉదయం జరిగిన దాడులలో ఆరుగురు గాయపడ్డారు. సెంట్రల్‌ ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలపై బాలిస్టిక్‌ క్షిపణి దాడులు జరగగా ముగ్గురు చనిపోయారు. రష్యా ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణులను ఉక్రెయిన్‌ కూల్చలేకపోయింది. బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకునే వ్యవస్థల కొరతే దీనికి కారణంగా తెలుస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్