వాషింగ్టన్ : భారత్ సహా 20 దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్‌పై విలువ ఆధారిత సుంకాలను అమెరికా మినహాయించింది. భారత్ సహా 20 దేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే అర్హత కలిగిన కొన్ని పేటెంట్ మెడిసెన్స్, వాటికి సంబంధించిన ముడి పదార్థాలపై విధించనున్న సుంకాల నుంచి మినహాయింపు లభించనుందని సోమవారం తెలిపింది. అయితే ఈ మినహాయింపు అన్ని మెడిసిన్స్‌కు వర్తించదు. నిర్దిష్ట పేటెంట్ మెడిసెన్స్, వాటి సంబంధిత పదార్థాలపై ఇతర దేశాలకు 100 శాతం సుంకాన్ని విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 29 నుంచి ఈ 100 శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో అమెరికా వాణిజ్య శాఖ సంబంధిత నోటీసును ‘ఫెడరల్ రిజిస్టర్’లో ప్రచురించింది. దేశీయ మెడిసిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా పేటెంట్ మెడిసెన్స్, బయోలాజిక్స్, వాటికి సంబంధించిన ముడి పదార్థాల దిగుమతులపై సుంకాలు విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ 2న ప్రకటన జారీ చేశారు. అయితే అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మెడిసెన్స్, వంధ్యత్వ చికిత్సలకు సంబంధించిన ఉత్పత్తులు, సెల్ థెరపీలు, జన్యు చికిత్సలు, యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్లు (ఏడీసీలు), జంతు మెడిసెన్స్‌కు సున్నా శాతం సుంకం విధించనున్నారు.
భారత్‌తోపాటు అర్జెంటీనా, బంగ్లాదేశ్, కంబోడియా, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, యూరోపియన్ యూనియన్, గ్వాటెమాలా, ఇండోనేషియా, జపాన్, జోర్డాన్, మలేషియా, ఉత్తర మాసిడోనియా, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, లీచెన్‌స్టెయిన్, తైవాన్, థాయ్‌లాండ్, బ్రిటన్, వియత్నాంలకు చెందిన అర్హత గల ఉత్పత్తులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అమెరికాతో ప్రస్తుత లేదా రాబోయే వాణిజ్య, భద్రతా ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాలు ఉన్నందున ఈ దేశాల నుంచి వచ్చే అర్హత కలిగిన ఉత్పత్తులపై సున్నా శాతం సుంకం విధించవచ్చని నోటీసులో పేర్కొన్నారు.
వాణిజ్య విస్తరణ చట్టంలోని సెక్షన్ 232 కింద మెడిసెన్స్, వాటికి సంబంధించిన పదార్థాల దిగుమతులను నియంత్రించేందుకు ట్రంప్ ఏప్రిల్‌లో జారీ చేసిన ప్రకటనలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారు. అనుబంధంలో పేర్కొన్న కొన్ని కంపెనీలకు 100 శాతం సుంకం జులై 31 నుంచే అమల్లోకి రాగా, ఇతర కంపెనీలకు సెప్టెంబర్ 29 నుంచి వర్తించనుంది. జెనరిక్ మెడిసెన్స్, వాటికి సంబంధించిన ముడి పదార్థాలు ఈ సెక్షన్ 232 మెడిసెన్స్ సుంకాల పరిధిలోకి రావు. పేటెంట్ లేని జంతు ఆరోగ్య ఉత్పత్తులను కూడా జెనరిక్ మెడిసెన్స్ ఉత్పత్తుల నిర్వచనంలో చేర్చేలా వాణిజ్య శాఖ తాజా నోటీసులో మార్పులు చేసింది.








కామెంట్‌లు (0)