పలుచోట్ల రాత్రంతా కాల్పులు
చిన్నారి సహా 19 మంది మృతి
టెహ్రాన్, కువైట్ సిటీ : ఇరాన్‌వ్యాప్తంగా పలు ప్రావిన్స్‌ల్లో మంగళవారం రాత్రంతా అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా 19 మంది మరణింరు. వీరిలో సామాన్యులు, మిలటరీ సిబ్బంది కూడా వున్నారని ఇరాన్ మీడియా పేర్కొంది. కాగా ఈ దాడులకు ప్రతిగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు, ఆస్తులపై ఇరాన్ సాయుధ బలగాలు ప్రతిచర్యలకు దిగినట్లు వార్తలు వెలువడ్డాయి.
కెర్మాన్షా పశ్చిమ ప్రావిన్స్‌లో అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో ఐఆర్‌జిసి ఏరోస్పేస్ డివిజన్‌కు చెందిన నలుగురు మరణించగా, దక్షిణ లావన్ దీవిలో జరిగిన మరో దాడిలో ఐఆర్‌జిసికి చెందిన బసిజ్ స్వచ్ఛంద దళ సభ్యులు ముగ్గురు మరణించారని ఇరాన్ మీడియా వార్తలు తెలిపాయి. బ్రహ్మై కౌంటీలో చొరబడుతున్న డ్రోన్ కదలికలను అడ్డుకునే క్రమంలో బుధవారం ఉదయం ఒక కమాండో మరణించారు.
వివాహ వేడుకపైనా అమానవీయ దాడి..
దక్షిణ హర్మోజ్‌గన్ ప్రావిన్స్‌లో సిరిక్ కౌంటీలో వివాహం జరుగుతున్న వేదికను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడి జరిపింది. ఈ దాడిలో నలుగురు మరణించగా, 68 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరణించినవారిలో నాలుగేళ్ళ చిన్నారి, టీనేజర్, ఇద్దరు మహిళలు వున్నారని చెప్పారు. అంతకుముందు అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడుల గురించి ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఇరాన్ మిలటరీ లక్ష్యాలపై అమెరికా బలగాలు వరుస దాడులను విజయవంతంగా ముగించాయని పేర్కొంది. అమెరికా మిలటరీ సభ్యులపై, హర్మూజ్ జలసంధిలోని వాణిజ్య నౌకలపై ఐఆర్‌జిసి ఇటీవల జరిపిన దాడుల నేపథ్యంలో ఈ ప్రతీకార దాడులకు దిగామంటూ పేర్కొంది. వివాహం జరుగుతున్న ప్రాంతంపై దాడి జరపడమంటే యుద్ధ నేరం కిందకే వస్తుందని ఇందుకు ప్రతిగా తాము కూడా జోర్డాన్, బహ్రెయిన్, ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), కుబైట్‌ల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటామని ఐఆర్‌జిసి, ఆర్మీ ప్రకటించింది. ఆ మేరకు బుధవారం ఉదయం జోర్డాన్‌లో, కువైట్‌లో ఇరాన్‌లోని కుర్దిష్ ప్రాంతంలో పలు చోట్ల దాడులకు దిగినట్లు ఐఆర్‌జిసి తెలిపింది. గ్లోబల్ హాక్, రాపార్ డ్రోన్లను బాలిస్టిక్ క్షిపణులతో అడ్డుకున్నామని తెలిపింది. కువైట్‌లోని అమెరికా కమాండర్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పదాతి దళాలతో దాడులకు పాల్పడింది. బహ్రెయిన్, యుఎఇల్లో వైమానిక స్థావరాలపై డ్రోన్లతో దాడులకు దిగింది. కాగా ఇరాన్ దాడులను కువైట్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని విమర్శించింది. తమ భద్రతా ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు తమకు అన్ని హక్కులు వున్నాయని స్పష్టం చేసింది.







కామెంట్‌లు (0)