శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బొగ్గు కటకట

11 గంటల క్రితం

coal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 09:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- విద్యుత్‌ ప్లాంట్లలో అడుగంటిన నిల్వలు..!

న్యూఢిల్లీ : దేశంలో వర్షాభావ పరిస్థితులతో కొనసాగుతున్న ఎండల తీవ్రతతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. మరోవైపు థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటుకుపోతున్నాయి. దేశంలోని సుమారు మూడింట ఒక వంతు బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఇఎ) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పీక్ పవర్ డిమాండ్ నమోదవుతోంది. గతంలో మే నెలలో నమోదైన 270.70 గిగావాట్ల రికార్డు స్థాయికి సమీపంలోనే కొనసాగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో కూడిన సుదీర్ఘ వేడిగాలుల కారణంగా విద్యుత్ వినియోగం ‌పెరగడం, గత కొన్ని రోజులుగా డిమాండ్ స్థిరంగా 267 గిగావాట్ల వద్దే నమోదవుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు నిల్వలు ఆందోళకర స్థాయికి పడిపోయాయి.

మూడు రోజులకే నిల్వలు..

అవసరమైన నిల్వల్లో 25 శాతం కంటే తక్కువగా లేదా కేవలం మూడు రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్న ప్లాంట్ల సంఖ్య ఆగస్టు చివరి నాటికి 45 ఉండగా, సెప్టెంబర్ 9 నాటికి ఆ సంఖ్య ఏకంగా 59కి పెరిగినట్లు సిఇఎ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పగటి పూట సోలార్ విద్యుత్ కొంతవరకు డిమాండ్‌ను తీరుస్తున్నప్పటికీ.. తగినంత బ్యాటరీ నిల్వ సౌకర్యం లేకపోవడం, జలాశయాలలో నీటి మట్టాలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలపై భారం విపరీతంగా పెరిగిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ క్లీన్ ఎయిర్ అనలిస్ట్ మనోజ్ కుమార్ తెలిపారు.

ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం రవాణా వేగాన్ని పెంచింది. విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను ముమ్మరం చేసేందుకు రైల్వే నెట్‌వర్క్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 3న 370 రైలు రేక్‌లను ఉపయోగించగా.. సెప్టెంబర్ 6 నాటికి వాటి సంఖ్యను 444కి పెంచారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన కోల్ ఇండియా తన గనుల వద్ద సుమారు 76 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర తగినంత నిల్వలు ఉన్నట్లు ప్రకటించింది. రోడ్డు మార్గాల ద్వారా కూడా రవాణాను పెంచుతున్నప్పటికీ, ప్లాంట్లకు సకాలంలో బొగ్గు చేరవేయడమే ప్రస్తుత పరిస్థితిలో అత్యంత కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్