- ఈ ఏడాది 6.6 శాతమే వృద్ధి..!
- ద్రవ్యోల్బణంపై ఆందోళన
న్యూఢిల్లీ: ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను 6.9 శాతం నుంచి 6.6 శాతానికి కోత పెట్టింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి, వినియోగ వ్యయం మందగించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే 2027-28 ఆర్థిక సంవత్సరానికి 7.3 శాతం వృద్ధి రేటు అంచనాను యథాతథంగా కొనసాగించింది. కాగా.. ప్రభుత్వ విధానపరమైన చర్యలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు, ఇంధన పన్నుల తగ్గింపు, సేవల ఎగుమతుల వృద్ధి, ప్రభుత్వ మూలధన వ్యయం వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాయని ఎడిబి తెలిపింది. మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతలు మరింత పెరగడం లేదా బలహీన రుతుపవనాల కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతింటే వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ద్రవ్యోల్బణ అంచనాను 4.6 శాతం నుంచి 5.2 శాతానికి పెంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం, ఆహార ధరలపై వేడి వాతావరణం ప్రభావం వంటి కారణాలు ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత్ 2026-27 వృద్ధి అంచనాను 6.4 శాతానికి తగ్గించింది.








కామెంట్‌లు (0)