త్రిపుర గ్రామ కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ బరితెగింపు
పట్టపగలే ప్రజాస్వామ్యం హత్య : జితేంద్ర చౌదరి
అగర్తల : త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్తి జిల్లా మండలి(టిటిఎఎడిసి) ఎన్నికల్లో బిజెపి గూండాలు దాడులతో రెచ్చిపోతున్నారు. ప్రతపక్షాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. నామినేషన్ పత్రాలను చించేసి, ఏకగ్రీవాలు చేసుకునేందుకు బరితెగించి వ్యవహరిస్తున్నారు. టిటిఎఎడిసికు చెందిన 587 గ్రామ కమిటీలలోని 4,597 స్థానాలకు ఈ నెల 28న ఎన్నికలు జరగున్నాయి. ఇందులో భాగంగా వీటికి నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. అయితే దాదాపు 2 వేల స్థానాల్లో లెఫ్ట్ ఫ్రంట్ సహా ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు దాఖలు చేయకుండా బిజెపి నాయకులు అడ్డుకున్నారు. వీరితో పాటు ఐపిఎఫ్‌టి, టిప్రా మోతాకు చెందిన దుండగులు కూడా ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకుంటున్నారు.
కార్యాలయాల్లోకి వెళ్లనీయకుండా అడ్డగింత..
జిరానియా, ఓల్డ్ అగర్తలా, హెజమర, లెఫుంగా, బెల్బారి, జంపుయిజాలతో సహా అనేక బ్లాకులలోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోకి లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులు ప్రవేశించకుండా బిజెపి గూండాలు అడ్డుకున్నారు. తమను నామినేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా బిజెపి గూండాలు అడ్డుకుంటున్నా.. పోలీసులు ప్రేక్షకులుగా ఉండిపోయారని ప్రతిపక్ష అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల దాడులకు దిగడం, నామినేషన్ పత్రాలను చించివేయడం చేశారని విమర్శించారు. అయినా బెదిరింపులు, ఆటంకాలు ఎదురైనప్పటికీ, చివరి రోజున 419 మంది లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులు వివిధ బ్లాకులలో తమ నామినేషన్లను దాఖలు చేయగలిగారు. అయితే, ప్రతిపక్ష అభ్యర్థులు కూడా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ చక్రవర్తి ప్రకటించడం గమనార్హం. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 11 చివరి తేదీ. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 5న జరుగుతుంది.
పోలీసుల సమక్షంలోనే దాడులు : జితేంద్ర చౌదరి
బిజెపి దాష్టికాలను సిపిఎం త్రిపుర రాష్ట్ర కార్యదర్శి, ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి ఖండించారు. పట్టపగలే ప్రజాస్వామ్యం హత్యకు గురయిందని విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా బిజెపి అడ్డుకోవడాన్ని సహించకూడదన్నారు. ‘‘ఈరోజు మనం మౌనంగా ఉంటే, రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుంది’’ అని ఆయన అన్నారు. పశ్చిమ త్రిపురలోని అనేక ప్రాంతాల్లోని నామినేషన్ కేంద్రాల్లోకి కూడా ప్రతిపక్ష అభ్యర్థులను ప్రవేశించకుండా బిజెపి, టిప్రా మోతా కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. అలాగే, జంపుయిజాలలో పోలీసుల సమక్షంలోనే సిపిఎం కార్యకర్తలు, మద్ధతుదారులను బిజెపి గూండాలు కొట్టి, తరిమివేశారని తెలిపారు. అలాగే, నామినేషన్ల ప్రక్రియ అనంతరం కూడా బిజెపి దౌర్జన్యం కొనసాగిందన్నారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారని, బెదిరింపులు, భయపెట్టే చర్యలు కూడా దిగుతున్నారని తెలిపారు.








కామెంట్‌లు (0)