గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘నీట్‌’ విద్యార్థులపై కొనసాగుతున్న వేధింపులు

1 గంట క్రితం

supreem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 07:05 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • యుపి మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్‌ ఆందోళనలకు సంబంధించి దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఈ నెల1న సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం విద్యార్థులపై వేధింపులు కొనసాగిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును బహిరంగంగా ఉల్లంఘిస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు, గౌతమ్‌బుద్ధ యూనివర్సిటీ న్యాయ విద్యార్థి అక్షత్‌ త్రిపాఠికి గ్రేటర్‌ నోయిడా ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌–3 నోటీసు జారీ చేశారు. రూ.5 లక్షలు ఒక రోజులోగా డిపాజిట్‌ చేయాలని నోటీసులో ఆదేశించారు. దీనిపై అక్షత్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం యుపి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘విద్యార్థులపై శిక్షా చర్యలు తీసుకోరాదని సెప్టెంబర్‌ 1నాటి ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పాం. ఆ ఉత్తర్వులు అమల్లో ఉండగానే నోటీసులు జారీ చేసే ధైర్యం మేజిస్ట్రేట్‌కు ఎలా వచ్చింది?’’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. నోటీసు ప్రతిని సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం, జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి వివరణ కోరతామని తెలిపింది. నీట్‌ కేసుల విచారణ గురువారం జరగనున్న నేపథ్యంలో అక్షత్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది కె.ఆర్‌. సుభాష్‌చంద్రన్‌ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో విద్యార్థులను ధర్నాకు ప్రేరేపించారనే ఆరోపణలతో ఎకోఫస్ట్‌ పోలీసులు ఇచ్చిన సిఫారసు మేరకు సెప్టెంబర్‌ 4న మేజిస్ట్రేట్‌ నోటీసు జారీ చేశారు. సెప్టెంబర్‌ 5న హాజరు కావాలని, రూ.5 లక్షలతో పాటు సమాన మొత్తానికి రెండు వ్యక్తిగత బాండ్లు సమర్పిం చాలని ఆదేశించినట్లు అక్షత్‌ తన పిటిషన్‌లో పేర్కొ న్నారు. తాను మే నెల నుంచే కళాశాలకు వెళ్లడం లేదని, అలాంటప్పుడు తాను ఏ నేరం చేశానో పోలీసులు వివరించాలని అక్షత్‌ ప్రశ్నించారు. నోటీసును రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇతర విద్యార్థులకు ఇలాంటి నోటీసులు జారీ చేయకుండా ఆదేశించాలని కోరారు. శాంతియుత ధర్నాకు పిలుపు నివ్వడాన్ని నేరంగా పరిగణించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్