నెల వ్యవధిలో 335 కోట్ల డాలర్ల పెరుగుదల
చమురు ధరలు, దిగుమతుల భారం
న్యూఢిల్లీ : భారత విదేశీ వాణిజ్యంలో లోటు మరింత పెరిగింది. ఎగుమతులు స్వల్పంగా పుంజుకున్నప్పటికీ.. దిగుమతులు అంతకంటే వేగంగా పెరగడంతో సెప్టెంబర్లో సరుకుల వాణిజ్య లోటు 3,021 కోట్ల డాలర్లకు చేరింది. ఆగస్టులో నమోదయిన 2,686 కోట్ల డాలర్లతో పోలిస్తే నెల వ్యవధిలోనే 335 కోట్ల డాలర్లు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్లో సరుకుల దిగుమతులు ఆగస్టులోని 7,067 కోట్ల డాలర్ల నుంచి 7,461 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఎగుమతులు 4,381 కోట్ల డాలర్ల నుంచి 4,440 కోట్ల డాలర్లకు మాత్రమే చేరాయి. దీంతో దిగుమతులు 394 కోట్ల డాలర్లు పెరగగా, ఎగుమతుల్లో పెరుగుదల కేవలం 59 కోట్ల డాలర్లకే పరిమితమైంది.
అమెరికా – ఇరాన్ మధ్య ముదురుతున్న ఘర్షణలు, అంతర్జాతీయ చమురు సరఫరాలో అంతరాయాలు భారత వాణిజ్యంపై ఒత్తిడి పెంచుతున్నాయి. బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్కు 100 డాలర్ల ఎగువన కొనసాగుతుండటం దిగుమతుల వ్యయాన్ని పెంచింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ఇంధన సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్కు ఈ పరిణామాలు ద్రవ్యోల్బణ ముప్పును పెంచుతున్నాయి. ఇప్పటికే ధరల ఒత్తిడిని నియంత్రించేందుకు ఈ నెల ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది.








కామెంట్లు (0)