- రూ.72.85 బిలియన్ల ఫారెక్స్ రాక
- ఆర్‌బిఐ వెల్లడి.
న్యూఢిల్లీ: దేశంలో విదేశీ మారకద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్‌బిఐ చేపట్టిన ప్రత్యేక డాలర్, రూపాయి స్వాప్ సదుపాయం ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) భారీ స్పందన లభించింది. ఆగస్టు 21 నాటికి ప్రవాస భారతీయులు విదేశీ కరెన్సీలో భారతీయ బ్యాంకుల్లో పెట్టే మొత్తం 72.85 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6.06 లక్షల కోట్లు)కు చేరాయి. ఇందులో ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) డిపాజిట్ల వాటానే కీలకంగా ఉంది. ఈ డిపాజిట్ల ద్వారా 65.397 బిలియన్ డాలర్లు, ఒఎఫ్‌సిబిల ద్వారా 4.86 బిలియన్ డాలర్లు, ఇసిబిల ద్వారా 2.591 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) డిపాజిట్ల విండో ఆగస్టు 31తో ముగియనుండగా, ఇసిబి, ఒఎఫ్‌సిబి విండోలు డిసెంబర్ 31 వరకు కొనసాగనున్నాయి. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) డిపాజిట్ల ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఈ చర్యల ద్వారా కనీసం 80 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను ఆకర్షించవచ్చని ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. రూపాయి విలువపై ఒత్తిడి, విదేశీ మారకద్రవ్య లభ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఆర్‌బిఐ ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అయితే భారీగా విదేశీ నిధులు తరలివచ్చినప్పటికీ రూపాయి మారకం విలువలో మాత్రం పెద్దగా మార్పు కనిపించకపోవడం గమనార్హం. జూన్ 5న ఆర్‌బిఐ ఈ చర్యలను ప్రకటించినప్పటి నుంచి రూపాయి దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది.








కామెంట్‌లు (0)