- సెన్సెక్స్ 443 పాయింట్ల పతనం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల వెల్లువ, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 443 పాయింట్లు కోల్పోయి 77,709 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 96 పాయింట్లు పడిపోయి 24,238.50 ముగిసింది. ఉదయం స్వల్ప లాభనష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో ఒక దశలో 700 పాయింట్లకుపైగా క్షీణించి 77,368 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో కొంత కోలుకున్నప్పటికీ నష్టాలను పూర్తిగా పూడ్చుకోలేకపోయింది. బ్యాంకింగ్ షేర్ల లో అమ్మకాలు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం. త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు దాదాపు 5 శాతం, యాక్సిస్ బ్యాంక్ షేరు 6 శాతం వరకు క్షీణించాయి. మరోవైపు, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 91 డాలర్ల సమీపానికి చేరుకోవడం ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు కూడా సుమారు 4 శాతం చొప్పున పడిపోవడం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్-30లో ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు కూడా నష్టాలను చవిచూశాయి. అయితే ట్రెంట్, పవర్ గ్రిడ్, ఎన్‌టిపిసి, ఎస్‌బిఐ, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి షేర్లలో కొనుగోళ్లు కనిపించగా.. ఫార్మా, మెటల్ రంగాల షేర్లు కొంత మెరుగ్గా రాణించి మార్కెట్‌కు పరిమిత మద్దతు అందించాయి.








కామెంట్‌లు (0)