బీజింగ్ : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఇటీవల భారీగా పడిపోవడంతో చైనా సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లను మరింత వేగవంతం చేసింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. వరుసగా 20వ నెల కూడా బంగారం కొనుగోళ్లు కొనసాగాయి. జూన్‌లో గత రెండున్నర ఏళ్లలోనే అత్యధికంగా నిల్వలను పెంచుకుంది. మే నెలలో 74.96 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులుగా ఉన్న నిల్వలు జూన్ చివరికి 75.44 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు చేరాయి. ఒక్క నెలలోనే దాదాపు 15 మెట్రిక్ టన్నులకు సమానమైన 4.8 లక్షల ఔన్సుల బంగారాన్ని కొనుగోలు చేయడం అక్టోబర్ 2023 తర్వాత ఇదే తొలిసారి. అయితే బంగారం ధరలు పడిపోవడంతో చైనా బంగారు నిల్వల విలువ మాత్రం తగ్గింది. మేలో 340.75 బిలియన్ డాలర్లుగా ఉన్న నిల్వల విలువ జూన్ చివరికి 303.72 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకుంది. జూన్‌లో స్పాట్ గోల్డ్ ధరలు 11.65 శాతం పతనమవడం 2008 తర్వాత అతిపెద్ద నెలవారీ క్షీణతగా నమోదైంది. డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి వంటి పరిణామాల నేపథ్యంలో ధరలు తగ్గడంతో దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా చైనా బంగారు నిల్వలను మరింత పెంచుకోవడం విశేషంగా మారింది.








కామెంట్‌లు (0)