శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కెన్యాలో కార్పొరేట్లకు సెగలు

1 గంట క్రితం

tata
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 10:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వనరుల జాతీయవాదం తీవ్రరూపం..

- టాటా గ్రూప్‌నకు ఎదురుదెబ్బ

నైరోబి : ఆఫ్రికా దేశమైన కెన్యాలో విదేశీ పెట్టుబడులపై వనరుల జాతీయవాదం విధానం తీవ్రరూపం దాల్చుతోంది. ఆరు కోట్ల జనాభా కూడా దాటని ఈ సాధారణ దేశంలో కార్పొరేట్ల దోపిడిపై పోరు కొనసాగుతోంది. విదేశీ కంపెనీలు కేవలం ముడి ఖనిజాలను వెలికితీసి ఎగుమతి చేయడం కాకుండా.. అక్కడే ఉత్పత్తులు చేపట్టాలని, స్థానికంగానే ఉపాధి కల్పన పెంచాలనే కఠిన నిబంధనలను కెన్యా ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ ప్రాజెక్టులు రద్దయిన కొద్దికాలానికే.. భారతీయ దిగ్గజ సంస్థ టాటా కెమికల్స్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ఆదేశించడం పారిశ్రామిక వర్గాల్లో ఇప్పడు తీవ్ర కలకలం రేపింది.

కజియాడో కౌంటీలోని లేక్ మగాడి వద్ద సోడా యాష్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టాటా కెమికల్స్ మగాడి లిమిటెడ్ (టిసిఎంఎల్‌) కార్యకలాపాలను నిలిపివేయాలని కెన్యా మైనింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముడి ఖనిజాన్ని కేవలం ఎగుమతి చేయకుండా, కెన్యాలోనే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ప్రభుత్వ ఆదేశాలపై టాటా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ స్టే లభించలేదు. కెన్యాలో విదేశీ కార్పొరేట్‌ కంపెనీలపై వ్యతిరేకత నెలకొనడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన బేస్ రిసోర్సెస్ వంటి కంపెనీలు, చైనా సంస్థలు కూడా ఈ నిరసనలను ఎదుర్కొన్నాయి. 2024లో అదానీ గ్రూప్ చేపట్టాల్సిన సుమారు 1.85 బిలియన్ డాలర్ల నైరోబీ ఎయిర్‌పోర్ట్ ఆధునికీకరణ, విద్యుత్ ప్రసార ప్రాజెక్టులు ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో రద్దయ్యాయి. గతంలో ఎస్సార్, కరుటూరి గ్లోబల్, మహీంద్రా వంటి సంస్థలు కూడా కెన్యాలో వివిధ నియంత్రణ సవాళ్లను ఎదుర్కొన్నాయి.

అయితే ఇవన్నీ కేవలం భారత్‌పై వ్యతిరేకత వల్ల జరుగుతున్నవి కాదని, స్థానిక వనరుల పరిరక్షణ కోసమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కెన్యా ప్రభుత్వం టాటాను పూర్తిగా వెనక్కి వెళ్లేలా చేస్తుందా లేక రాయల్టీలు, స్థానిక ప్రాసెసింగ్ నిబంధనల విషయంలో కొత్త ఒప్పందానికి పట్టుబడుతుందా అనేది వచ్చే నెలల్లో తేలనుంది. వనరుల జాతీయవాదాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్న ఆఫ్రికా దేశాల తీరు భవిష్యత్తులో విదేశీ పెట్టుబడులపై ఏవిధమైన ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

నిబంధనలన్నీ పాటిస్తున్నాము : ‌టాటా కెమికల్స్‌

​కెన్యాలోని లేక్ మగాడిలో గనుల తవ్వకాల నిలిపివేత ఆంక్షలపై టాటా కెమికల్స్ స్పందించింది. తమ అనుబంధ సంస్థ టాటా కెమికల్స్ మగాడి లిమిటెడ్ (టిసిఎంఎల్‌) అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తోందని స్పష్టం చేసింది. చట్టపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్