- రేట్ ఆగదు.. డిమాండ్ తగ్గదు థీమ్‌తో ఏర్పాటు
ప్రజాశక్తి - హైదరాబాద్ : నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రాపర్టీ షోను నిర్వహించనున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. ‘రేట్ ఆగదు.. డిమాండ్ తగ్గదు’ అనే థీమ్‌తో ఆగస్టు 28 నుంచి 30 వరకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో-2026ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాపర్టీ ఎక్స్‌పోలో 100కు పైగా రెరా ఆమోదం పొందిన నివాస, వాణిజ్య ప్రాజెక్టులు ఒకే వేదికపై ప్రదర్శించబడనున్నాయి. గృహ కొనుగోలుదారులు ప్రముఖ డెవలపర్లతో నేరుగా మాట్లాడటంతో పాటు బ్యాంకుల నుంచి గృహ రుణాలపై సమాచారం, ఆర్థిక సలహాలు పొందే అవకాశం ఉంటుంది.
ప్రాపర్టీ షో వివరాలను క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ బి. జగన్నాథ్ రావు ఇతర కార్యవర్గ సభ్యులు, మేనేజింగ్ కమిటీ సభ్యులతో కలిసి వెల్లడించారు. జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మౌలిక వసతుల విస్తరణ, ఐటి రంగం అభివృద్ధి, నిరంతర డిమాండ్ కారణంగా ఆస్తుల ధరలు తగ్గే పరిస్థితి లేదని, కొనుగోలుదారులు వేచి చూడకుండా ఇప్పుడే పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఈ ప్రాపర్టీ షో ఏర్పాట్లను కన్వీనర్ బి. జైపాల్ రెడ్డి, కో-కన్వీనర్ బి. వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ నిపుణులు, పరిశోధనా సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక చర్చలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ప్రెసిడెంట్ ఎలెక్ట్ బి. జగన్నాథ్ రావు మాట్లాడుతూ.. గచ్చిబౌలి వంటి ప్రధాన ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాల్లో చదరపు అడుగు ధర రూ.5,000 నుంచి రూ.10,000కు పెరిగిందన్నారు. గత ఏడాదిలోనే రూ.600-750 వరకు పెరుగుదల నమోదైందన్నారు. ప్రధాన ప్రాంతాల్లో భవిష్యత్తులోనూ ధరలు, డిమాండ్ పెరుగుతూనే ఉంటాయని, ఆలస్యం చేస్తే గృహ కొనుగోలు మరింత ఖరీదవుతుందని పేర్కొన్నారు. పారదర్శకత, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇస్తూ పూర్తిగా ధృవీకరించిన రెరా ప్రాజెక్టులను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాపర్టీ షో ప్రధాన లక్ష్యమని తెలిపారు.








కామెంట్‌లు (0)