- జనవరి నుంచి 8.9 శాతం ప్రియం
ముంబయి : ప్రముఖ లాజిస్టిక్స్ దిగ్గజం డిహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ భారత్‌లో సరుకు రవాణ ఛార్జీలను అమాంతం పెంచాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 8.9 శాతం మేర సరుకు రవాణ చార్జీలను పెంచుతున్నట్లు శనివారం అధికారికంగా వెల్లడించింది. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కరెన్సీ మారకం విలువల్లో హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ద్రవ్యోల్బణంతో పాటు ఇంధన ధరల భారం, విభిన్న దేశాల నిబంధనలు, కస్టమ్స్, సెక్యూరిటీ పరమైన అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయని కంపెనీ వెల్లడించింది. అనేక దేశాలలో కార్మిక మార్కెట్ ఒత్తిళ్లు కూడా తమ కార్యాచరణ ఖర్చులను పెంచుతున్నాయని డిహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 220కి పైగా దేశాల్లో డిహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలు సాగిస్తోంది. వాణిజ్య వాతావరణంలో వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలను అందించేందుకే ఈ ధరల సర్దుబాటు అని డిహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ సౌత్ ఆసియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ సుబ్రమణియన్ తెలిపారు. గ్లోబల్ నెట్‌వర్క్, డిజిటల్ సామర్థ్యాలు, సెక్యూరిటీ మౌలికవసతులు, స్థిరమైన లాజిస్టిక్స్ పరిష్కారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సవాళ్లను అధిగమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)