ఈ ఏడాదిలో 30 శాతం పతనం
ముంబయి : ప్రముఖ ప్రయివేటు రంగ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు వరుస నష్టాలతో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు ఈ షేరు విలువ దాదాపు 30 శాతం మేర పడిపోయి కొత్త కనిష్ట స్థాయిలను తాకడంతో టెక్నికల్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ప్రస్తుత సిఇఒ శశిధర్ జగదీశన్ పదవీకాలం అక్టోబర్‌తో ముగియనుండటంతో కొత్త సారథి ఎంపికపై స్పష్టత లేకపోవడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లలో ఆందోళనను కలిగిస్తున్నాయి. టెక్నికల్ చార్ట్‌ల ప్రకారం ఈ షేరు ప్రస్తుతం బలహీనమైన ‘డౌన్‌ట్రెండ్’ కొనసాగిస్తోందని, అన్ని ప్రధాన మూవింగ్ యావరేజెస్‌కు దిగువన ట్రేడవుతూ బేరిష్ మొమెంటంను ప్రదర్శిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బుధవారం బిఎస్‌ఇలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ 1.56 శాతం తగ్గి రూ.700.95 వద్ద ముగిసింది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని టెక్నికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ షేరుకు రూ.710 వద్ద కీలక మద్దతు లభిస్తుండగా, ఒకవేళ ఈ స్థాయిని కూడా కోల్పోతే మాత్రం మరింత అమ్మకాల ఒత్తిడి వచ్చి ధర రూ.680 నుంచి రూ.660 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని బోనంజా రీసెర్చ్ విశ్లేషకులు తెలిపారు. మరోవైపు ఎస్‌బిఐ సెక్యూరిటీస్ నిపుణుల అంచనా ప్రకారం.. షేరు స్వల్పకాలికంగా కోలుకోవాలంటే రూ.750 స్థాయిని దాటాల్సి ఉంటుందని, అప్పటివరకు ప్రతి రేంజ్‌లోనూ బలహీనత కొనసాగే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మదుపర్లు కొత్త పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.








కామెంట్‌లు (0)