గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionట్రాక్టర్ అమ్మకాలకు ఎల్‌‌నినో సెగ

3 గంటల క్రితం

tractor sales fell
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 10:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వ్యవసాయానికి ముప్పు..

  • జెఎం ఫైనాన్షియల్ రిపోర్ట్‌

న్యూఢిల్లీ : ఎల్‌నినో ప్రభావం భారత వ్యవసాయ రంగంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని జెఎం ఫైనాన్షియల్ వెల్లడించింది. గతంలో నమోదైన ఎల్‌నినోలతో పోల్చితే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, ఆహార ధాన్యాల ఉత్పత్తి క్షీణించడం, ఫుడ్ ద్రవ్యోల్బణం పెరగడం వంటి ప్రతికూల పరిణామాలు కనిపించాయని వెల్లడించింది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ), ద్విచక్ర వాహనాల విక్రయాలు, ట్రాక్టర్ అమ్మకాలు, ఖరీఫ్ విత్తనాలు, జలాశయాల నీటి మట్టాలు, వ్యవసాయ ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, రుణాల వృద్ధి వంటి 13 కీలక సూచికలను జెఎం ఫైనాన్షియల్ ఈ రిపోర్ట్‌‌లో పరిశీలించింది.

ఎల్‌నినో సంవత్సరాల్లో వర్షపాతం సగటున 10.65 శాతం మేర లోటుగా నమోదవగా, ఖరీఫ్ సాగు విస్తీర్ణం సుమారు 1 శాతం తగ్గింది. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 4 శాతం క్షీణించడంతో పాటు అహార ద్రవ్యోల్బణం లా నీనా కాలంతో పోలిస్తే సగటున 60 బేసిస్ పాయింట్లు ఎక్కువగా నమోదయ్యింది. జిడిపిలో వ్యవసాయం స్థూల విలువ ఆధారిత ఉత్పత్తి (జివిఎ) దాదాపు 18 శాతం వాటా కలిగి ఉంది. ఎల్‌నినో సంవత్సరాల్లో వ్యవసాయ వృద్ధి దాదాపు నిలిచిపోయినట్టేనని.. లా నీనా సంవత్సరాలతో పోలిస్తే వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి సుమారు 350 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.

వ్యవసాయంపై ఆధారపడిన రంగాల్లో ట్రాక్టర్ విక్రయాలే అత్యధికంగా దెబ్బతిన్నాయని అధ్యయనం పేర్కొంది. ఎల్‌నినో కాలంలో ట్రాక్టర్ అమ్మకాల వృద్ధి కేవలం 3.5 శాతానికే పరిమితమవగా, లా నీనా సంవత్సరాల్లో 10.7 శాతం పెరుగుదల నమోదయ్యింది. అలాగే వాతావరణ అనిశ్చితి కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇలు) బ్యాంకు రుణాల ప్రవాహం భారీగా తగ్గిందని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ గరిష్ఠ డిమాండ్ వేగంగా పెరిగిందని విశ్లేషించింది.

​జూన్‌లో దేశవ్యాప్తంగా 39.8 శాతం వర్షాభావం నమోదవడం ఆందోళన కలిగించిందని జెఎం ఫైనాన్షియల్ పేర్కొంది. జులైలో వర్షాలు ఊపందుకున్నప్పటికీ.. జూన్‌లో ఏర్పడిన లోటును పూర్తిగా పూడ్చుకోవాలంటే ఈ నెలలో సాధారణ సగటు కంటే 123.5 శాతం అధికంగా అంటే దాదాపు 346 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరమని అంచనా వేసింది. జులై నెల ఖరీఫ్ సాగు, జలాశయాల నింపుదల, భూగర్భ జలాల పునరుద్ధరణకు అత్యంత కీలకమైన కాలం కావడంతో ఈ నెలలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఆహార ధరలపై మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్