- చంటిపిల్లల ఉత్పత్తుల ప్రకటనల్లో నిబంధనల ఉల్లంఘన
న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి దిగ్గజం నెస్లే ఇండియా లిమిటెడ్‌పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. చంటిపిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల విక్రయాలు, ప్రకటనల్లో నిబంధనలు పాటించడంలో విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కంపెనీకి చెందిన నాన్ ఎక్సెల్లా ప్రో స్టేజ్ 1, లాక్టోజన్ ప్రో 1 ఉత్పత్తులతో పాటు మరో ఫాలో అప్ ఫార్ములాకు సంబంధించిన ప్రచార మెటీరియల్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో గుర్తించి ఈ చర్యలు చేపట్టింది. నాన్ ఎక్సెల్లా ప్రో స్టేజ్ 1 లో 5 హెచ్‌ఎంఒలు, వే ప్రోటీన్ ఉంటాయని, లాక్టోజన్ ప్రో 1 లోని వే ప్రోటీన్ సులభంగా జీర్ణమవుతుందని ప్రచారం చేయడాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ తప్పుబట్టింది. 2020 నాటి శిశు పోషకాహార నిబంధనలు,1992 నాటి ఐఎంఎస్ చట్టం ప్రకారం శిశు ఆహార విక్రయాలను పెంచేలా ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం నిషేధమని స్పష్టం చేసింది. దీనికి తోడు కంపెనీ తయారు చేసిన ఫాలో అప్ ఫార్ములా నమూనాలో ఉండాల్సిన బయోటిన్ పోషకం నాణ్యతా ప్రమాణాల ప్రకారం లేదని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఈ విషయాలపై కంపెనీ నుంచి వివరణ కోరిన అనంతరం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ఈ లీగల్ చర్యలకు పూనుకుంది. దీంతో గురువారం ఆ కంపెనీ షేర్ బిఎస్‌ఇలో 1.38 శాతం తగ్గి రూ.1,353.10 వద్ద ముగిసింది.








కామెంట్‌లు (0)