కేంద్ర తీరుపై ఆర్థిక నిపుణుల ప్రశ్నల వర్షం
కొత్త ఉద్యోగాలెక్కడ : రఘురాం రాజన్
అంతా మాయాజాలం : సుభాష్ చంద్ర గార్గ్
గణాంకాల గారడిపై పెరుగుతోన్న విమర్శలు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 7.8 శాతం నమోదైందంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన గణాంకాల మాయాజాలం మాత్రమేనని ఆర్థిక, రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి సీతారామన్ ఈ వృద్ధిని ఘన విజయంగా అభివర్ణిస్తుండగా.. ప్రతిపక్షాలు, కొందరు మాజీ అధికారులు వృద్ధి రేటు మూడు శాతానికి మించదంటూ ప్రభుత్వ లెక్కలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ లేవనెత్తిన లెక్కలు, ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యక్తం చేసిన ఉద్యోగాల సృష్టిపై సందేహాలు అంకెల గారడిపై మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
రూ.6 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి? : గార్గ్
బలమైన మూలధన వ్యయం, దూసుకుపోతున్న సేవా రంగమే ఈ వృద్ధికి కారణమని మోడీ ప్రభుత్వం చెబుతుండగా.. సుభాష్ చంద్ర గార్గ్ ఇదంతా కేవలం గణాంకాల గారడీయేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వం గతేడాది తొలి త్రైమాసికపు నామమాత్రపు జిడిపిని ఏకంగా రూ. 86 లక్షల కోట్ల నుంచి రూ.80 లక్షల కోట్లకు తగ్గించిందని విశ్లేషించారు. సుమారు రూ. 6 లక్షల కోట్లను అకస్మాత్తుగా మాయం చేశారని.. ఆ మొత్తం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ప్రస్తుత వాస్తవ వృద్ధి కేవలం 2.6 శాతంగానే ఉంటుందన్నారు. దీనికి ద్రవ్యోల్బణాన్ని కూడా జోడించి చూస్తే వాస్తవ వృద్ధి దాదాపు సున్నా శాతానికి దగ్గరగా ఉంటుందని విశ్లేషించారు. అధికారులు నేరుగా మోసం చేశారని తాను అననప్పటికీ గతాన్ని బలహీనపరచడం ద్వారా వర్తమానాన్ని మెరుగ్గా చూపించే ట్రెండ్ ప్రమాదకరమని అన్నారు.
డొల్లతనానికి నిదర్శనం.. : జైరాం రమేష్
ఆర్థిక వ్యవస్థ పురోగతిని చూపించేందుకు ప్రభుత్వం గణాంకాల సవరణలతో తప్పుడు లెక్కలు ఇస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ లెక్కలు ప్రభుత్వ ప్రకటనల డొల్లతనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ రమేష్ విమర్శించారు. ప్రచార స్టంట్ (పిఆర్) ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచలేరని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం, అధికార వర్గాలు ఖండించాయి. పాత 2011-12 బేస్ ఇయర్ సిరీస్ గణాంకాలను.. కొత్త 2022-23 బేస్ ఇయర్ సిరీస్ లెక్కలతో పోల్చడం శాస్త్రీయంగా సరైన పద్ధతి కాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరతలు నెలకొన్నప్పటికీ భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్నారు.
ఉద్యోగాల కల్పన ఎక్కడ : రఘురామ్ రాజన్
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ యువతకు తగినన్ని ఉద్యోగాలు ఎందుకు సృష్టించలేకపోతున్నామని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశ్నించారు. ‘భారత్ ఇంత వేగంగా వృద్ధి చెందుతుంటే మంచి ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)ఎందుకు భారీగా రావడం లేదు?’ అని రాజన్ ఓ వీడియోలో అనుమానాలు వ్యక్తం చేశారు. తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతే ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.
వాస్తవ జిడిపి 2-3 శాతమే : శంకర్ శర్మ
భారత్ అధికారికంగా 7.8 శాతం జిడిపి వృద్ధిని నమోదు చేసినప్పటికీ.. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణుడు శంకర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఇకపై తాను కేవలం గణాంకాల ఆధారిత జిడిపి చర్చలపై ఆసక్తి చూపబోనని, ప్రజల జీవన ప్రమాణాలను ప్రతిబింబించే ‘రియల్ ఫీల్’ జిడిపి వృద్ధిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అధిక వృద్ధి ఉంటే ప్రజల్లో మరి ఒత్తిడి ఎందుకు పెరుగుతోందని ఆయన ప్రశ్నించారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో నగరాలు, గ్రామాల్లో మౌలిక వసతులు కేవలం 100 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ మాదిరిగానే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఈ ప్రాతిపదికన భారత్ రియల్ ఫీల్ వృద్ధి కేవలం 2-3 శాతమేనని తెలిపారు. మరోవైపు కేవలం 2-3 శాతం వృద్ధి మాత్రమే ఉన్న యూరప్‌లో ప్రజలు సంతోషంగా, ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారని.. అక్కడ రియల్ ఫీల్ వృద్ధి 7.8 శాతంగా కనిపిస్తోందని శంకర్ శర్మ పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)