- వారంలో 5.654 బిలియన్ డాలర్ల తగ్గుదల
ముంబయి : భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరోమారు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. జూన్ 26తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 5.654 బిలియన్ డాలర్లు తగ్గి 666.933 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బిఐ శుక్రవారం ఓ నివేదికలో వెల్లడించింది. అంతకుముందు వారంలో ఈ నిల్వలు 963 మిలియన్ డాలర్లు పెరిగి 672.587 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. తాజా వారంలో ఆ వృద్ధి పడిపోవడం గమనార్హం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రూపాయి విలువపై ఒత్తిడి పెరగడం, తద్వారా ఆర్‌బిఐ మార్కెట్లో డాలర్లను విక్రయించి రూపాయిని స్థిరీకరించే ప్రయత్నం చేయడం వంటి అంశాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నాటికి నిల్వలు 728.494 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయికి చేరగా.. ఆ తర్వాత నుంచి తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం.. విదేశీ మారక నిల్వలలో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు150 మిలియన్ డాలర్లు తగ్గి 541.067 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇందులో డాలర్ మినహా యూరో, పౌండ్, యెన్ వంటి ఇతర కరెన్సీల విలువలో వచ్చిన మార్పులు కూడా ఇమిడి ఉంటాయి. దేశంలోని బంగారు నిల్వల విలువ ఏకంగా 5.394 బిలియన్ డాలర్లు క్షీణించి 102.536 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే విధంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ఉన్న ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (ఎస్‌డిఆర్) 89 మిలియన్ డాలర్లు తగ్గి 18.558 బిలియన్ డాలర్లకు, ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వల స్థానం 21 మిలియన్ డాలర్లు తగ్గి 4.772 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బిఐ తన నివేదికలో స్పష్టం చేసింది.







కామెంట్‌లు (0)