శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విదేశీ సంస్థల చేతికి ఐడిబిఐ బ్యాంక్‌..!

5 గంటల క్రితం

idbi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రయివేటీకరణ ప్రక్రియ వేగవంతం

- కేంద్రం ఆర్థిక బిడ్ల పరిశీలన

న్యూఢిల్లీ : ఐడిబిఐ బ్యాంక్‌ విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ సంస్థ విక్రయ ప్రక్రియను మోడీ సర్కార్‌ ‌వేగవంతం చేసింది. పలు ఆసక్తిగల సంస్థలు సమర్పించిన సవరించిన ఆర్థిక బిడ్లను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోంది. ప్రయివేటీకరణలో భాగంగా ఐడిబిఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన 30.48 శాతం, ఎల్‌ఐసి తన 30.24 శాతం వాటాలను అమ్మకానికి పెట్టాయి. విదేశీ సంస్థలు ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌, దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్‌ ఎన్‌బిడి ఈ వాటాల కొనుగోలుకు సవరించిన ఆర్థిక బిడ్లను సమర్పించాయి. వ్యూహాత్మక విక్రయ ప్రక్రియను ఈ ఏడాది తిరిగి ప్రారంభించిన అనంతరం జులై13న ఈ సంస్థలు తమ సవరించిన ఆఫర్లను దాఖలు చేశాయి. ఇప్పటికే భారత బ్యాంకింగ్‌ రంగంలో కార్యకలాపాలు కలిగిన ఈ రెండు సంస్థలకు కేంద్ర హోంశాఖ భద్రతా అనుమతులతో పాటు ఆర్‌బిఐ నుంచి ‘ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌’ అంచనా లభించింది. ఈ రెండు సంస్థలు ఐడిబిఐ బ్యాంక్‌ కోసం ఆర్థిక బిడ్లు దాఖలు చేయడం ఇది రెండోసారి. 2022 అక్టోబర్‌లో ప్రభుత్వం ఆసక్తి కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా.. తదుపరి పరిశీలన అనంతరం 2023 ఫిబ్రవరి 6న ఆర్థిక బిడ్లు దాఖలయ్యాయి. అయితే అప్పట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శుల నేతృత్వంలోని అంతర మంత్రిత్వ శాఖ నిర్ణయించిన రిజర్వ్‌ ధర కంటే బిడ్లు తక్కువగా ఉండటంతో ప్రక్రియను నిలిపివేశారు. ​కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను మళ్లీ వేగవంతం చేయడంతో జులైలో సవరించిన బిడ్లను తీసుకుంది. ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్‌ఐసికి 49.24 శాతం వాటా ఉంది. ఈ రెండు సంస్థల వద్ద కలిపి 94.71 శాతం వాటా ఉంది. విక్రయ ప్రక్రియ పూర్తయితే కేంద్రం, ఎల్‌ఐసి కలిపి 60.72 శాతం వాటాను ప్రయివేటు, విదేశీ పెట్టుబడిదారులకు బదిలీ చేయనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్