- అధిక సుంకాల ప్రభావం
- బులియన్ మార్కెట్‌కు భారీ దెబ్బ
న్యూఢిల్లీ : పసిడి దిగుమతులపై మోడీ సర్కార్ అమలు చేస్తోన్న అధిక సుంకాలు అక్రమ సరఫరాకు దారి తీస్తున్నాయి. భారతదేశ బులియన్ మార్కెట్‌ను అక్రమ బంగారు దిగుమతులు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 8,000 వరకు తక్కువ ధరకు విక్రయిస్తూ చట్టబద్ధమైన వ్యాపారులను సంక్షోభంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో బంగారం దిగుమతి సుంకం 6 శాతం నుండి 15 శాతానికి కేంద్రం పెంచింది. దీనివల్ల ఈ ఏడాది భారత్‌లోకి చట్టవిరుద్ధ మార్గాల ద్వారా 100 టన్నులకు పైగా బంగారం ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డిఆర్‌ఐ) జులై 25 నాటికి దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్లలో 27 కిలోలకు పైగా అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకుని 12 మందిని అరెస్టు చేసినప్పటికీ.. సుంకాలు పెరిగినప్పుడు అంతర్జాతీయ, దేశీయ ధరల మధ్య వ్యత్యాసం పెరిగి స్మగ్లింగ్ పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) నమూనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాలపై ఆల్ ఇండియా జెమ్ అండ్ జెవెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే స్పందిస్తూ, దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2013 ప్రారంభంలో సుంకం 4 శాతం పెరిగినప్పుడు 2014 తొలి త్రైమాసికంలో అనధికారిక దిగుమతులు సుమారు 10 టన్నుల నుండి 70 టన్నులకు ఎగిశాయని వెల్లడించారు. అదే విధంగా జులై 2022లో సుంకం 10.75 శాతం నుండి 15 శాతానికి పెరిగినప్పుడు కూడా అనధికారిక దిగుమతులు 17 టన్నుల నుండి 2022 చివరి నాటికి 50 టన్నులకు చేరుకుని 2023లొనూ అధిక స్థాయిలో కొనసాగాయని పరిశ్రమ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.








కామెంట్‌లు (0)