- ఐదేళ్లు ఇంధనాలను సరఫరా చేయనున్న ఐఒసి
న్యూఢిల్లీ: భారత్, మారిషస్ కీలక ఇంధన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మారిషస్ అవసరాలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఎటిఎఫ్) ఇంధనాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) వచ్చే ఐదేళ్లపాటు సరఫరా చేయనుంది. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి ఆగస్టు 20, 21 తేదీల్లో మారిషస్‌లో పర్యటించిన సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. చమురు, సహజ వాయువు రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాల మధ్య ప్రభుత్వ స్థాయి అవగాహన ఒప్పందం కూడా జరిగింది. ఇంధన ఉత్పత్తుల సరఫరాతో పాటు శిక్షణ, సామర్థ్య పెంపు, బయోఫ్యూయల్స్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అంతర్జాతీయ ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు మారిషస్‌కు నిరంతర ఇంధన సరఫరా కల్పించడంలో ఈ దీర్ఘకాలిక ఒప్పందం కీలకంగా మారనుంది. ఐఒసి, మారిషస్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దక్షిణాసియా వెలుపల భారత ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ కుదుర్చుకున్న తొలి దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందాల్లో ఇదొకటిగా నిలిచింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్న సమయంలో ఈ ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది. నేపాల్, భూటాన్‌లకు ఇంధన సరఫరా చేస్తున్న భారత్.. తాజాగా మారిషస్‌కు కూడా కీలక ఇంధన సరఫరాదారుగా మారుతోంది. 27,500 టన్నుల బంకర్ ఫ్యూయెల్ నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న మెరైన్ బంకర్ ఫ్యూయెల్ స్టోరేజ్ ఫెసిలిటీకి పోర్ట్ లూయిస్‌లోని మె రూజ్‌లో హర్దీప్‌సింగ్ పూరి శంకుస్థాపన చేశారు. ఈ సదుపాయాన్ని ఇండియన్ ఆయిల్ (మారిషస్) లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు.
మారిషస్ ప్రధాని నవిన్‌చంద్ర రామ్‌గూలాంత్‌తో పాటు పలువురు కీలక మంత్రులతో పూరి సమావేశమయ్యారు. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ (జిబిఎ) వ్యవస్థాపక సభ్య దేశమైన మారిషస్ కోసం రూపొందించిన ‘బయోఫ్యూయల్స్ కంట్రీ ల్యాండ్‌స్కేప్ పాలసీ’ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఇరు దేశాల మంత్రులు సంయుక్తంగా ప్రారంభించారు. తాజా ఒప్పందాలతో ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, మౌలిక వసతులు, ప్రత్యామ్నాయ ఇంధన రంగాల్లో సహకారం మరింత విస్తరించనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.








కామెంట్‌లు (0)